ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్ మరోసారి భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కారు. దేశం పేరు ప్రస్తావించకుండానే ఈశాన్య రాష్ట్రాలపేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) విజయం సాధించింది. దీంతో ప్రభుత్వ సారథి పదవికి మహమ్మద్ యూనస్ సోమవారం పదవి నుంచి వైదొలిగారు. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘మన విశాల సముద్రం కేవలం భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు.. అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో బంగ్లాదేశ్ మమేకమవడానికి ఒక బహిరంగ ద్వారం. నేపాల్, భూటాన్, సెవెన్ సిస్టర్స్‌తో కూడిన ఈ ప్రాంతానికి గొప్ప ఆర్థిక సామర్థ్యం ఉంది” వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ ఇకపై ఏ దేశం ముందు ‘విధేయత’ ప్రదర్శించబోదని, ఇతర దేశాల ఆదేశాల ప్రకారం నడుచుకోదని స్పష్టం చేశారు. యూనస్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దౌత్యపరంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
