డచ్ మరో ధమాకా

డచ్ మరో ధమాకా
  •     87 రన్స్‌‌‌‌ తేడాతో బంగ్లాదేశ్​ను చిత్తు చేసిన  నెదర్లాండ్స్‌‌‌‌
  •     సెమీస్‌‌ రేసు నుంచి బంగ్లా ఔట్

కోల్‌‌‌‌కతా: వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో క్వాలిఫయర్​ నెదర్లాండ్స్ మరో సంచలనం సృష్టించింది. ఆల్‌‌రౌండ్ షోతో  బంగ్లాదేశ్‌‌‌‌ సెమీస్‌‌‌‌ ఆశలపై నీళ్లు కుమ్మరించింది.  టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో బ్యాటర్లు చేతులెత్తేయడంతో శనివారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో  బంగ్లా 87 రన్స్‌‌‌‌ భారీ తేడాతో పసికూన నెదర్లాండ్స్‌‌‌‌ చేతిలో చిత్తయ్యింది. ఆరు మ్యాచ్‌‌ల్లో ఐదో ఓటమితో సెమీస్‌‌ రేసు నుంచి దాదాపు వైదొలిగింది.

టాస్‌‌‌‌ గెలిచిన డచ్‌‌‌‌ టీమ్​ మొదట 50 ఓవర్లలో 229 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. స్కాట్‌‌‌‌ ఎడ్వర్డ్స్‌‌‌‌ (68), వెస్లీ బార్రెసీ (41), సైబ్రండ్‌‌‌‌ (35), వాన్‌‌‌‌ బీక్‌‌‌‌ (23 నాటౌట్‌‌‌‌) రాణించారు. 4 రన్స్‌‌‌‌కే 2 వికెట్లు కోల్పోయిన డచ్‌‌‌‌ను బార్రెసీ, అకెర్‌‌‌‌మన్‌‌‌‌ (15) మూడో వికెట్‌‌‌‌కు 59 రన్స్‌‌‌‌ జోడించి ఆదుకున్నారు. తర్వాత ఎడ్వర్డ్స్ రెండు కీలక భాగస్వామ్యాలు జోడించాడు. డి లీడె (17)తో ఐదో వికెట్‌‌‌‌కు 44, సైబ్రండ్‌‌‌‌తో ఐదో వికెట్‌‌‌‌కు 78 రన్స్‌‌‌‌ జత చేశాడు.

చివర్లో షారిజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (6), అర్యన్‌‌‌‌ దత్‌‌‌‌ (9), మీకెరెన్‌‌‌‌ (0) నిరాశపర్చడంతో డచ్‌‌‌‌ ఓ మాదిరి టార్గెట్‌‌‌‌కే పరిమితమైంది. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌, తస్కిన్‌‌‌‌ అహ్మద్‌‌‌‌, ముస్తాఫిజుర్‌‌‌‌, మెహిదీ హసన్‌‌‌‌ తలా రెండు వికెట్లు తీశారు. చిన్న టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌ 42.2 ఓవర్లలో 142 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. మెహిదీ హసన్‌‌‌‌ మీరాజ్‌‌‌‌ (35) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌గా నిలిచాడు. మీకెరెన్‌‌‌‌ (4/23), డి లీడె (2/25) సమయోచిత బౌలింగ్‌‌‌‌కు బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌‌‌‌కు క్యూ కట్టారు.

19 రన్స్‌‌‌‌కే లిటన్‌‌‌‌ దాస్‌‌‌‌ (3), తన్జీద్‌‌‌‌ హసన్‌‌‌‌ (15) ఔటయ్యారు. మీరాజ్ నిలకడగా ఆడినా రెండో ఎండ్‌‌‌‌లో సహకారం కరువైంది. నజ్ముల్ శాంటో (9), షకీబ్‌‌‌‌ (5), ముష్ఫికర్‌‌‌‌ (1) విఫలం కావడంతో బంగ్లా 70/6తో ఎదురీత మొదలుపెట్టింది. లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో మహ్ముదుల్లా (20), మెహిదీ హసన్‌‌‌‌ (17), తస్కిన్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (11), ముస్తాఫిజుర్‌‌‌‌ (20) పోరాటం చేసినా డచ్‌‌‌‌ బౌలర్ల ముందు నిలువలేకపోయారు. అర్యన్‌‌‌‌ దత్‌‌‌‌, వాన్‌‌‌‌ బీక్‌‌‌‌, అకెర్‌‌‌‌మన్‌‌‌‌ తలా ఓ వికెట్‌‌‌‌ తీశారు. మీకెరెన్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

సంక్షిప్త స్కోర్లు


నెదర్లాండ్స్‌‌: 50 ఓవర్లలో 229 (ఎడ్వర్డ్స్‌‌ 68, ముస్తాఫిజుర్‌‌ 2/36, మెహిదీ హసన్‌‌ 2/40). బంగ్లాదేశ్‌‌: 42.2 ఓవర్లలో 142 (మెహిదీ హసన్‌‌ 35,  మీకెరెన్‌‌ 4/23, డి లీడె 2/25).