
కళ్ల ముందు కొండంత లక్ష్యం.. ఎదురుగా చూస్తే అరవీర భయంకరమైన కరీబియన్ పేసర్లు.. పేస్ , బౌన్స్ , షార్ట్ , స్వింగ్ తో 22 గజాల పిచ్ పై బంతి రాకెట్ లాగా దూసుకొస్తోంది. బ్యాట్ తో ముట్టుకోవాలంటేనే భయపడే పరిస్థితి.. కానీ బంగ్లా బ్యాటింగ్ పులుల ముందు ఇవేవీ పని చేయలేదు. కాకలు తీరిన విండీస్ పేసర్లను వెంటాడి నిర్దా క్షిణ్యంగా వేటాడేశారు. సమయానుకూలంగా.. సమయోచితంగా.. నియంత్రణతో.. సీనియర్ ప్లేయర్ షకీబల్ (99 బంతుల్లో 16 ఫోర్లతో 124 నాటౌట్ ) సెంచరీతో చేసిన ‘రన్ ’ రంగంలో కొండలా పేరుకుపోయిన 322 రన్స్ టార్గెట్ మంచులా కరిగిపోయింది. లిటన్ దాస్ (69 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 94 నాటౌట్ ) కూడా బ్యాట్ అడ్డేయడంతో మరో 51 బంతులు మిగిలి ఉండగానే బంగ్లా విజయాన్ని అందుకుని ఔరా అనిపించింది. మొన్న సౌతాఫ్రికాపై 300 ప్లస్ స్కోరు చేస్తే.. నేడు అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేజ్ చేసి వరల్డ్‌కప్ లో రెండో సెన్సేషనల్ విక్టరీని అందుకుంది.
టాంటన్ : ప్రపంచకప్ లో రెండు వరుస పరాజయాలకు బంగ్లా దేశ్ అద్భుతంగా చెక్ పెట్టింది. ఆల్ రౌండ్ షోకు మించి అమోఘమైన బ్యాటింగ్ తో చెలరేగిన బంగ్లా .. భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేజ్ చేసి రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. షకీబల్ , లిటన్ దాస్ స్ఫూర్తిదాయక పోరాటంతో..సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో పటిష్ఠమైన విండీస్ ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బంగ్లా ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ కు దిగిన విండీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 321 పరుగులు చేసింది. హోప్ (121 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 96) సెంచరీ మిస్ చేసుకోగా, లూయిస్ (67బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 70), హెట్ మయర్ (26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50) దుమ్మురేపారు. తర్వాత బంగ్లా 41.3 ఓవర్లలో 3 వికెట్లకు 322 పరుగులు చేసి నెగ్గింది. తమీమ్ (48) రాణించాడు. షకీబల్ కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ’ అవార్డు లభించింది.
189 పరుగుల భాగస్వామ్యం భారీ టార్గెట్ ఛేజింగ్ లో బంగ్లాకు కళ్లెం వేసేందుకు విండీస్ పేసర్లు ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. తమీమ్ , సౌమ్య (29) తొలి వికెట్ కు 52 పరుగులు జత చేసి శుభారంభాన్నిచ్చారు. 9వ ఓవర్ లోనే సౌమ్య ఔటైనా.. వన్ డౌన్ లో షకీబల్ నిలబడ్డాడు. 10వ ఓవర్ లో తమీమ్ మూడు ఫోర్లు బాదడంతో బంగ్లా స్కో రు 70/1కు చేరింది. కుదురుకోవడానికి టైమ్ తీసుకున్న షకీబల్ క్రమంగా బ్యాట్ కు పదును పెట్టాడు. ఈ ఇద్దరి సమన్వయంతో ఇన్నింగ్స్ గాడిలో పడందనుకునే లోపే విండీస్ పేస్ మళ్లీ జూలు విదిల్చింది. 10 బంతుల తేడాలో తమీమ్ , ముష్ఫికర్ (1)ను ఔట్ చేయడంతో జట్టు స్కో రు 133/3గా మారింది. తమీమ్, షకీబల్ రెండో వికెట్ కు 69 రన్స్ జత చేశారు. లిటన్ దాస్ నిలకడ చూపడంతో 25 ఓవర్లు ము గిసేసరికి బంగ్లా 166/3 స్కో రుతో పటిష్ఠ స్థితిలో నిలిచింది.
40 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన షకీబ్ తర్వాత జోరు పెంచాడు. చకచకా బౌండరీలు కొట్టి తర్వాతి 4 ఓవర్లలో 34 పరుగులు రాబట్టడంతో బంగ్లా 200లకు చేరింది. ఈ జోడీని విడగొట్టేందుకు హోల్డర్ బౌలర్లను మార్చినా పెద్దగా ఫలించలేదు. 96 రన్స్ వద్ద థామస్ బంతిని బౌండరీకి తరలించి షకీబ్ సెంచరీ (83 బంతుల్లో) పూర్తి చేశాడు. రెండోఎండ్ లో లిటన్ కూడా 43 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ చేరాడు. అప్పటివరకు నెమ్మదిగా ఆడిన లిటన్ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. గాబ్రియల్ వేసిన 38వ ఓవర్ లో లిటన్ వరుసగా 6, 6, 6 తో 24 పరుగులు రాబట్టడంతో లక్ష్యం 12 ఓవర్లలో 28 పరుగులుగా మారింది. వరుస ఫోర్లతో 51 బంతులు మిగిలి ఉండగానే ఈ స్వల్ప టార్గెట్ ను ఛేజ్ చేసి జట్టును గెలిపించాడు. షకీబల్, లిటన్ నాలుగో వికెట్కు 189 పరుగులు జోడించారు.
హోప్ నిలబెట్టా డు..!
ఆరంభం నుంచే బంగ్లా పేసర్లు ముస్తా ఫిజుర్ (3/59), సైఫుద్దీన్ (3/72) చెలరేగడంతో విండీస్ ఓపెనర్లు చాలా ఇబ్బందిపడ్డారు. ము ఖ్యంగా ‘యూనివర్స్ బా స్ ’ క్రిస్ గేల్ 13 బంతులు ఆడి డకౌటయ్యాడు. ఫలితంగా 6 పరుగుల వద్దే విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో లూయిస్ , హోప్ ఇన్నింగ్స్ గాడిలో పెట్టే బాధ్యతను సమర్థంగా నిర్వర్తించారు. తొలి పవర్ ప్లేలో 33 పరుగులే వచ్చినా.. లూయిస్ బాదుడు మొదలుపెట్టడంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది. ఈ క్రమంలో 22.4 ఓవర్లలో కరీబియన్ల స్కోరు 100 దాటింది. షకీబ్ ను లక్ష్యంగా చేసుకుని లూయిస్ పవర్ హిట్టింగ్ చేశాడు. అతని బౌలింగ్లో 4, 4, 6 బా దినా.. చివరికి 25వ ఓవర్ లో షకీబ్ కే వికెట్ ఇచ్చుకున్నాడు. 75 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన లూయిస్ .. రెండో వికెట్ కు 116 పరుగులు జత చేయడంతో విండీస్ కోలుకుంది.
రెండో ఎండ్ లో పూరన్ (25) ఓ మాదిరిగా ఆడి వెనుదిరిగినా…. హెట్ మయర్ తడాఖా చూపెట్టాడు. భారీ హిట్టింగ్ చేస్తూ లాంగాన్ , లాంగాఫ్ లో ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. హోప్ కూడా జతకలవడంతో పరుగుల ప్రవాహం పోటెత్తింది. మంచి జోరుమీదున్న విండీస్ కు 40వ ఓవర్ లో ముస్తా ఫిజుర్ పగ్గాలు వేశాడు. 4 బంతుల తేడాలో హెట్ మయర్ , రసెల్ (0)ను ఔట్ చేయడంతో కరీబియన్ 240/5 స్కోరుతో నిలిచింది. చివరి 10 ఓవర్లలో హోల్డర్ (15బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 33) సుడిగాలిలా విరుచుకుపడ్డాడు. కానీ హోప్ అతి జాగ్రత్తకు పోయి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 22 బంతుల వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ కావడంతో స్కో రుకు కళ్లెం పడింది.
???? BANGLADESH WIN ????
Shakib Al Hasan and Liton Das steer their side to a convincing seven-wicket over West Indies in Taunton. #RiseOfTheTigers | #CWC19 pic.twitter.com/2gwXICKhz5
— ICC (@ICC) June 17, 2019