
దంబుల్లా: తొలి టీ20లో శ్రీలంక చేతిలో ఎదురైన ఓటమికి బంగ్లాదేశ్ వెంటనే ప్రతీకారం తీర్చుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో బంగ్లా 83 రన్స్ తేడాతో లంకను చిత్తు చేసింది. సిరీస్‌ను 1–1తో సమం చేసింది. ఈ వన్‌సైడ్ పోరులో తొలుత కెప్టెన్ లిటన్ దాస్ (50 బాల్స్‌లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 76) విజృంభించడంతో బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 177/7 స్కోరు చేసింది. షమీమ్ హుస్సేన్ (48) కూడా రాణించాడు. లంక బౌలర్లలో బినురా ఫెర్నాండో మూడు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం ఛేజింగ్‌లో శ్రీలంక 15.2 ఓవర్లలో 94 రన్స్‌కే కుప్పకూలి చిత్తుగా ఓడింది. ఓపెనర్ పాథుమ్ నిశాంక (32), దాసున్ షనక (20) తప్ప మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హుస్సేన్ మూడు, షోరిఫుల్ ఇస్లాం, సైఫుద్దీన్ చెరో రెండు వికెట్లు తీశారు. లిటన్ దాస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. మూడో, చివరి టీ20 బుధవారం కొలంబోలో జరగనుంది.