హోరాహోరీ పోరులో జింబాబ్వేపై బంగ్లా విజయం

హోరాహోరీ పోరులో జింబాబ్వేపై బంగ్లా విజయం

టీ20 వరల్డ్ కప్ 2022లో బంగ్లాదేశ్ మరో విజయం సాధించింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 3 పరుగుల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో జింబాబ్వే బంగ్లాదేశ్పై గెలిచినంత పనిచేసింది. అయితే కీలక సమయంలో సీన్ విలియమ్స్ రనౌట్ కావడంతో విజయం బంగ్లాదేశ్ను వరించింది. ఈ విజయంతో గ్రూప్-2లో బంగ్లాదేశ్ 4 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం టీమిండియా 4 పాయింట్లతో నెంబర్ వన్ లో కొనసాగుతోంది.  సౌతాఫ్రికా మూడు పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. 

ఆదుకున్న శాంటో..

హోరాహోరీగా సాగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఓపెనర్ సౌమ్య సర్కార్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ శాంటో హాఫ్ సెంచరీతో రాణించాడు. 55 బంతుల్లో సిక్స్, 7 ఫోర్లతో 71 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ షకీబుల్ హసన్ 23 పరుగులు, హుస్సేన్ 29 పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ, ముజారబానీ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు.  రజా, సీన్ విలియమ్స్ ఒక్కో వికెట్ తీశారు. 

బంగ్లాను భయపెట్టిన జింబాబ్వే..

151 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులే చేసి ఓడిపోయింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోని జింబాబ్వే తమ ఓపెనర్ల వికెట్లను  కోల్పోయింది. మాధేవెరే 4 పరుగులు, క్రెయిగ్ ఎర్విన్ 8 పరుగులే చేసి ఔటయ్యారు. తర్వాత వచ్చిన మిల్టన్ శుంబా కూడా త్వరగా పెవిలియన్ చేరాడు. ఐతే ఈ సమయంలో సీన్ విలియమ్స్ జట్టును ఆదుకున్నాడు. 42 బంతుల్లో 8 ఫోర్లతో 64 పరుగులు చేశాడు.  జట్టును గెలిపించే ప్రయత్నంలో రనౌట్ అవడం..జింబాబ్వే విజయావకాశాలపై దెబ్బపడింది. చివర్లో ర్యాన్ బర్ల్ 25 బంతుల్లో  సిక్స్,  ఫోర్ తో 27 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ రెగిస్ చకబ్వా 15 పరుగులు సాధించాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్  3 వికెట్ల పడగొట్టాడు.  హుస్సేన్, రెహ్మన్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నాడు.