రెండో వన్డేలోనూ అదరగొట్టిన బంగ్లా..సిరీస్ కైవసం

 రెండో వన్డేలోనూ అదరగొట్టిన బంగ్లా..సిరీస్ కైవసం

రెండో వన్డేలోనూ టీమిండియా ఓడిపోయింది. ఉత్కఠభరితంగా సాగిన మ్యాచ్లో భారత జట్టు 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. ఇక ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2–0తో దక్కించుకుంది.

టాపార్డర్ విఫలం..

272 పరుగుల టార్గెట్ తో బరిలోకి  దిగిన భారత జట్టుకు రెండో ఓవర్ లోనే షాక్ తగిలింది. రోహిత్ కు బదులు ఓపెనర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ 5 పరుగులే చేసి ఎబాదత్ హోస్సెన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ ధావన్ 8 పరుగులు చేసి ముస్తాఫిజుర్ రెహ్మాన్ పెవీలియన్ చేరాడు. టాపార్డర్ లో వచ్చిన వాషింగ్టన్ సుందర్‌ షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా  39 పరుగులకే 3  కీలక వికెట్లు కోల్పోయింది.

ఆదుకున్న అయ్యర్..

ఈ స్థితిలో బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయస్ అయ్యర్... కేఎల్ రాహుల్‌తో కలిసి బ్యాటింగ్ చేశాడు. అయితే 14 పరుగులు చేసిన రాహుల్ ను మెహ్‌దీ హసన్ ఎల్బీగా ఔట్ చేశాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్‌తో శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకున్నాడు. ఇదే క్రమంలో శ్రేయస్ అయ్యర్ 69 బంతుల్లో అర్థసెంచరీ సాధించాడు. అక్షర్ పటేల్ కూడా  50 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. వీరిద్దరు ఐదో వికెట్ కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే ఈ జోడీని మెహ్‌దీ హసన్ విడదీశాడు. శ్రేయస్ అయ్యర్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. కొద్ది సేపటికే అక్షర్ పటేల్‌ను ఎబాదత్ హోస్సెన్ పెవీలియన్ చేర్చాడు. ఆతర్వాత వచ్చిన శార్దూల్ ఠాకూర్ కూడా వెంటనే ఔటవ్వడంతో భారత్ 207 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. దీంతో  రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు దిగాడు. ఈ సమయంలో భారత్ మరో వికెట్ ను కోల్పోయింది. 213 పరుగుల వద్ద దీపక్ చాహర్ ఔటయ్యాడు. 


రెచ్చిపోయిన రోహిత్ శర్మ...

ఈ సమయంలో రోహిత్ శర్మ రెచ్చిపోయాడు.  ఎబాదత్ హోస్సెన్ వేసిన 46వ ఓవర్‌లో రోహిత్ రెండు భారీ సిక్సర్లతో పాటు ఓ ఫోర్ కొట్టాడు. అయితే 47 ఓవర్ లో సింగిల్ తీసిన రోహిత్..48వ ఓవర్ లో జిడ్డు బ్యాటింగ్  తో  సిరాజ్ ఒక్క సింగిల్ కూడా తీయలేదు. ఇక  49వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు కొట్టిన రోహిత్ శర్మ 20 పరుగులు సాధించాడు. చివరి ఓవర్‌లో టీమిండియా గెలవాలంటే 20 పరుగులు కావాలి. తొలి నాలుగు బంతుల్లో రోహిత్ రెండు బౌండరీలు కొట్టాడు. టీమిండియా విజయానికి ఆఖరి రెండు బంతుల్లో  12 పరుగులు అవసరమవ్వగా రోహిత్ ఒక సిక్స్ బాదాడు. అయితే చివరి బంతికి పరుగులేమి రాకపోవడంతో..భారత్ 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.  బంగ్లా బౌలర్లలో ఎబడోట్ హొస్సేన్ 3 వికెట్లు, మెహ్దీ హసన్, షకిబుల్ హసన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ముస్తఫిజుర్ రహమాన్, మహమ్మదుల్లా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. 

69 పరుగులకే 6 వికెట్లు

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్‌లో అనుముల్ హక్(11)ను సిరాజ్ ఎల్బీగా ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నజ్ముల్ హెస్సెన్ షాంటో(21), కెప్టెన్ లిటన్(7) విఫలమయ్యారు. ఇదే సమయంలో  9వ ఓవర్‌లో  లిటన్ దాస్‌ను పెవీలియన్ చేర్చాడు. దీంతో  బంగ్లా 44 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఉమ్రాన్ మాలిక్ 151 కిలోమీటర్ల డెలవరీతో నజ్ముల్‌ను ఔట్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ వరుస ఓవర్లలో షకీబ్ అల్ హసన్(8), ముష్ఫికర్ రహీమ్(12), అఫిఫ్ హోస్సెన్‌(0)లను పెవీలియన్ దారి పట్టించాడు. దీంతో బంగ్లాదేశ్ 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
 

మరోసారి మెరిసిన హసన్..

ఈ సమయంలో మెహ్‌దీ హసన్ మీర్జా మరోసారి జట్టును ఆదుకున్నాడు. తొలి వన్డేలో అద్భుత ఆటతీరుతో జట్టును గెలిపించిన  మెహ్‌దీ హసన్..ఈ వన్డేలోనూ అదే పోరాటం..ఆత్మ విశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. మహ్మదుల్లాతో కలిసి స్కోరు బోర్డును నడిపించాడు. వీరిద్దరిని ఔట్ చేసేందుకు భారత బౌలర్లుతీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ఇదే క్రమంలో మెహ్‌దీ హసన్ హాఫ్ సెంచరీ సాధించగా.. మహ్మదుల్లా కూడా హాఫ్ సెంచరీ కొట్టాడు. 7 వికెట్ కు 148 పరుగుల పాట్నర్ షిప్ ను నమోదు చేసిన తర్వాత మహ్మదుల్లా  సుందర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి  వచ్చిన నసుమ్ అహ్మద్‌తో కలిసి మెహ్‌దీ హసన్ భారీ స్కోర్ అందించాడు. చివరి ఓవర్‌లో రెండు భారీ సిక్స్‌లు కొట్టి సెంచరీ సాధించాడు.  టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీశాడు. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.