బంగ్లా క్రికెటర్ల సమ్మె

బంగ్లా క్రికెటర్ల సమ్మె
  • బీసీబీ ముందు జీతాల పెంపు సహా 11 డిమాండ్లు
  • అప్పటిదాకా క్రికెట్‌ యాక్టివిటీ బాయ్‌కాట్‌
  •  ప్రకటించిన కెప్టెన్‌ షకీబల్‌,50 మంది ప్లేయర్లు
  • సమ్మె కొనసాగితే ఇండియా టూర్‌ ప్రశ్నార్థకం!

ఢాకా: బంగ్లాదేశ్‌‌ క్రికెటర్లు సమ్మెకు దిగారు. బంగ్లా క్రికెట్‌‌ బోర్డు (బీసీబీ).. తమ జీతాలు పెంచడం సహా పదకొండు డిమాండ్లను నెరవేర్చేవరకు క్రికెట్‌‌ యాక్టివిటీని బాయ్‌‌కాట్‌‌ చేస్తున్నట్టు తెలిపారు. స్ట్రైక్‌‌ విషయాన్ని సోమవారం జరిగిన మీడియా సమావేశంలో స్టార్ ప్లేయర్లు షకీబల్‌‌ హసన్‌‌, మహ్మదుల్లా, ముష్ఫికర్‌‌ రహీమ్‌‌ ప్రకటించారు. దాదాపు యాభై మంది ఇంటర్నేషనల్, ఫస్ట్​క్లాస్​ క్రికెటర్లు ఆందోళనలో పాల్గొంటున్నారు. దాంతో, వచ్చే నెలలో ఆ జట్టు జరిపే ఇండియా టూర్‌‌ సందిగ్థంలో పడింది. ఈ టూర్‌‌లో భాగంగా బంగ్లా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. నవంబర్​ మూడో తేదీన జరిగే తొలి టీ20తో ఈ టూర్‌‌ షురూ అవనుంది. వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో భాగంగా జరిగే సిరీస్‌‌కు బంగ్లా గైర్హాజరైతే రూల్స్‌‌ ప్రకారం సిరీస్‌‌తో పాటు 120 పాయింట్లను ఇండియాకు ఐసీసీ కేటాయిస్తుంది.

క్రికెటర్ల డిమాండ్లు

బంగ్లాదేశ్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌ (బీపీఎల్‌‌)ను మళ్లీ ఫ్రాంచైజీ మోడల్‌‌లో నిర్వహించడంతో పాటు ఢాకా ప్రీమియర్‌‌ లీగ్‌‌ (బంగ్లా డొమెస్టిక్‌‌ ఫస్ట్‌‌-క్లాస్‌‌ టోర్నీ)ను కూడా మళ్లీ ఓపెన్‌‌ మార్కెట్‌‌ ట్రాన్స్‌‌ఫర్‌‌లోకి తీసుకెళ్లాలని ఆటగాళ్లు డిమాండ్‌‌ చేస్తున్నారు. ఇక, సెంట్రల్‌‌ కాంట్రాక్ట్‌‌ జీతాలు పెంచడం, ఎక్కువ మందిని సెంట్రల్‌‌ కాంట్రాక్ట్‌‌లోకి తీసుకోవడంతో పాటు ప్లేయర్స్‌‌ అసోసియేషన్‌‌ను కాన్‌‌ఫ్లిక్ట్‌‌ ఆఫ్‌‌ ఇంట్రస్ట్‌‌ నుంచి మినహాయించాలని అంటున్నారు. ఫస్ట్‌‌-క్లాస్‌‌ లెవెల్‌‌ క్రికెటర్లకు మ్యాచ్‌‌ ఫీజులు పెంచాలన్నది ప్రధాన డిమాండ్‌‌. ‘ఫస్ట్‌‌-క్లాస్‌‌ క్రికెటర్ల మ్యాచ్‌‌ ఫీజును 35 వేల టకాల (బంగ్లా కరెన్సీ)ను  లక్షకు పెంచాలి. అలాగే వారి జీతాలను కూడా యాభై శాతం పెంచాలి. డైలీ అలవెన్స్‌‌గా ఇచ్చే 1500 టకాలు ఏమాత్రం సరిపోదు. ట్రావెల్‌‌ అలవెన్స్‌‌లను కూడా పెంచాలి’అని షకీబల్‌‌ హసన్‌‌ తెలిపాడు. కాగా, బోర్డుతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని బీసీబీ సీఈఓ నిజాముద్దీన్‌‌ చౌధురి తెలిపారు.

బంగ్లా వస్తుంది: గంగూలీ

ఇండియా టూర్​కు -బంగ్లాదేశ్‌‌ వస్తుందని బీసీసీఐ అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు చేపట్టనున్న సౌరవ్‌‌ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు.  బీసీబీతో ఆటగాళ్లు చర్చించి తమ సమస్య పరిష్కరించుకుంటారని భావిస్తున్నట్లు చెప్పాడు. సమ్మె విషయం  బంగ్లాదేశ్​ అంతర్గత వ్యవహారం అన్న దాదా.. అవసరమైతే బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ హోదాలో తాను బీసీబీతో మాట్లాడతానని తెలిపాడు.  కాగా, బంగ్లాదేశ్​తో టీ20 సిరీస్​లో ఆడాలో లేక రెస్ట్​ తీసుకువాలో అనేది కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఇష్టమని గంగూలీ అన్నాడు.  బీసీసీఐ బాస్​గా ఈ విషయంపై ఈ నెల 24న  కోహ్లీతో చర్చిస్తా అని చెప్పాడు.

Read more News

Bangladesh’s India tour under threat after cricketers go on strike