
ఇండియా, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు కారణంగా పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా పడింది. ఈ లీగ్ లో ఆడుతున్న ఫారెన్ ప్లేయర్లకు మాత్రం చేదు అనుభవాలు ఎదురయ్యాయి. విదేశీ ఆటగాళ్లు పాకిస్థాన్ నుంచి దుబాయ్ చేరుకోవడానికి చాలా ఇబ్బంది పడినట్టు తెలుస్తుంది. దుబాయ్ చేరుకున్న తర్వాత ఫారెన్ ఆటగాళ్లు పాకిస్థాన్ లో చేదు అనుభవాలు ఎదురైనట్టు తెలుస్తుంది. బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రిషద్ హుస్సేన్ శనివారం (మే 10) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విదేశీ ఆటగాళ్లు దుబాయ్‌లో అడుగుపెట్టిన తర్వాత వారికి ఉపశమనం లభించిందని తెలిపాడు.
"మేము పెద్ద సంక్షోభాన్ని అధిగమించి దుబాయ్ చేరుకున్నాము. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. మేము విమానాశ్రయం నుండి బయలుదేరిన 20 నిమిషాల తర్వాత విమానాశ్రయాన్ని క్షిపణి ఢీకొట్టిందని దుబాయ్ వెళ్ళాక విన్నాము. ఆ వార్త భయంకరంగా అనిపించింది. ఇప్పుడు ఇక్కడ ఉండటం నాకు ఉపశమనం కలిగించింది".అని లాహోర్ ఖలందర్స్ తరపున ఆడుతున్న హుస్సేన్ దుబాయ్ విమానాశ్రయంలో విలేకరులతో చెప్పాడు. తన సహచరుడు నహిద్ రాణా చాలా టెన్షన్ పడ్డాడని అయితే సురక్షితంగా దుబాయ్ చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నామని ఈ బంగ్లా ఆల్ రౌండర్ తెలిపాడు.
ఇతర విదేశీ ఆటగాళ్ళు చాలామంది భయపడ్డారని.. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఇకపై పాకిస్తాన్‌కు వెళ్లనని ప్రమాణం చేశాడు. మిచెల్ తో పాటు సామ్ బిల్లింగ్స్, కుశాల్ పెరెరా, డేవిడ్ వైస్, టామ్ కుర్రాన్ వంటి విదేశీ ఆటగాళ్ళు.. చాలా భయపడ్డారని రిషద్ తెలిపాడు. "టామ్ కుర్రాన్ విమానాశ్రయానికి వెళ్ళాడు. కానీ విమానాశ్రయం మూసివేయబడిందని విన్నాడు. అప్పుడు అతను చిన్న పిల్లాడిలా ఏడవడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతన్ని అక్కడ నుంచి పంపించడానికి ఇద్దరు వ్యక్తులు అవసరమయ్యారు" అని హుస్సేన్ ఈ సందర్భంగా తెలిపాడు.
Bangladesh's Rishad Hossain Reveals What Cricketers Experienced During PSL 2025! pic.twitter.com/ImACi53ZQB
— CRICKETNMORE (@cricketnmore) May 10, 2025