DPL 2025: ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌.. ఉద్దేశ్యపూర్వకంగా ఔటైన ప్లేయర్‌పై ఐదేళ్ల నిషేధం

DPL 2025: ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌.. ఉద్దేశ్యపూర్వకంగా ఔటైన ప్లేయర్‌పై ఐదేళ్ల నిషేధం

బంగ్లాదేశ్ క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలు చోటు చేసుకున్నాయి. ఢాకా ప్రీమియర్ లీగ్ (DPL)లో భాగంగా బంగ్లాదేశ్ బ్యాటర్ మిన్హాజుల్ అబెడిన్ సబ్బీర్‌ ఔటైన తీరుపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఢాకా ప్రీమియర్ లీగ్ లో అబెడిన్ సబ్బీర్‌ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు స్పష్టంగా అర్ధమవుతోంది. షైన్‌పుకూర్ క్రికెట్ క్లబ్, గుల్షన్ క్రికెట్ క్లబ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అనుమానాస్పదంగా ఔట్ కావడమే ఇందుకు కారణం. దీంతో అవినీతి నిరోధక విభాగం( ACU) రంగంలోకి దిగింది.

విచారణ చేపట్టి ఆ మ్యాచ్‌లో రెండు అవుట్‌లు అనుమానాస్పదంగా ఉన్నాయని గుర్తించింది. ఈ కేసు విచారణలో లభించిన ఆధారాల ప్రకారం సబ్బీర్‌పై కనీసం ఐదేళ్ల నిషేధం విధించాలని అవినీతి నిరోధక విభాగం(ACU) సిఫార్సు చేసింది. "నేరం తీవ్రత దృష్ట్యా మేము కనీసం ఐదు సంవత్సరాల నిషేధాన్ని సిఫార్సు చేస్తున్నాము. ట్రిబ్యునల్ తీర్పును బట్టి ఎనిమిది నుండి పది సంవత్సరాల వరకు నిషేధం విధించే అవకాశం ఉంది". అని అవినీతి నిరోధక విభాగం తెలిపింది. 

షైనెపుకుర్ బ్యాటర్ మిన్హాజుల్ అబెదిన్ విచిత్ర రీతిలో స్టంపౌటయ్యాడు. ఇన్నింగ్స్ 44వ ఓవర్లో సబ్బీర్ బ్యాటింగ్ చేస్తుండగా.. అనూహ్యంగా క్రీజు నుంచి ముందుకు వచ్చాడు. గుల్షన్ వికెట్ కీపర్ అలీఫ్ హసన్ తన తొలి ప్రయత్నంలోనే స్టంప్స్‌ను బ్రేక్ చేయలేకపోయాడు. కానీ తన క్రీజులోకి తిరిగి రావడానికి చాలా సమయం ఉన్నప్పటకీ సబ్బీర్.. నిర్లక్ష్యంగా క్రీజ్ బయటే ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని అలీఫ్ జారవిడవలేదు. రెండో ప్రయత్నంలో స్టంపౌట్ చేశాడు. ఈ క్రమంలో సబ్బీర్ ఉద్దేశ్య పూర్వకంగానే బ్యాట్ క్రీజ్ లో పెట్టలేదని స్పష్టంగా తెలుస్తుంది.