బంజారాహిల్స్ ఘటన నన్ను కలచివేసింది: చిరంజీవి

బంజారాహిల్స్  ఘటన నన్ను కలచివేసింది: చిరంజీవి

బంజారాహిల్స్ బాలిక ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నాలుగేళ్ల పసిబిడ్డపై స్కూల్ లో జరిగిన అఘాయిత్యం ఘటన తనను బాగా కలచి వేసిందన్నారు. ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించాలంటూ  ట్వీట్ చేశారు. అన్ని విద్యాసంస్థల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాట్లకు ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. భావితరాలకు భరోసా కల్పించడం అందరి సమిష్టి బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. 

బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఘటనలో స్కూల్ ప్రిన్స్ పాల్, డ్రైవర్ లను పోలీసులు అరెస్టు చేశారు. బీఎస్‌డీ డీఏవీ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే జిల్లా విద్యా శాఖాధికారిని ఆదేశించారు. కానీ ఈ నిర్ణయంతో చాలామంది స్టూడెంట్ల తల్లిదండ్రులు ఏకీభవించడం లేదు. జరిగిన  ఘటన తీవ్రమైనదేనని.. అందుకు ప్రిన్సిపల్, డ్రైవర్​ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ డీఏవీ స్కూల్​లో చదువుతున్న 700 మంది స్టూడెంట్లను ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు.