డీఏవీ స్కూల్ నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి

డీఏవీ స్కూల్ నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి

హైదరాబాద్: బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ ఘటన కేసులో నిందితులను పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. ఘటనలో  అరెస్టయిన పాఠశాల డ్రైవర్ రజిని కుమార్ తో పాటు ప్రిన్సిపాల్ మాధవిని లోతుగా విచారించేందుకు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. డ్రైవర్ రజిని కుమార్, ప్రిన్సిపాల్ మాధవి ఇద్దరినీ నాలుగు రోజులపాటు పోలీసుల కస్టడీకి అనుమతిచ్చింది. రేపటి నుంచి నాలుగు రోజులపాటు ఇద్దరినీ పోలీసులు ప్రశ్నించనున్నారు. 

స్కూల్ రీ ఓపెన్ పై ఆందోళన 

డీఏవీ స్కూల్ రీ ఓపెన్ పై ఎటూ తేల్చకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించడంతో విద్యాశాఖ అధికారులు సమీక్షిస్తున్నామంటున్నారే తప్ప తేల్చి చెప్పలేదు. ఇప్పటికే వేల రూపాయల ఫీజు యాజమాన్యం వసూలు చేసిందని.. విద్యార్థులను ఇప్పటికిప్పుడు  వేరే స్కూల్ కు తరలించడం ఆర్ధికంగా భారం అవుతుందనే విషయాలను దృష్టిలో పెట్టుకుని స్కూల్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.