అతి చిన్న బ్యాంకు.. ఏటీఏం, వెబ్‌సైట్‌ లేదు.. ఇద్దరే ఉద్యోగులు

అతి చిన్న బ్యాంకు..  ఏటీఏం, వెబ్‌సైట్‌ లేదు.. ఇద్దరే ఉద్యోగులు

అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో బ్యాంక్‌ అనే పేరు చెప్పగానే జేపీ మోర్గాన్‌ ఛేజ్‌, మోర్గాన్‌ స్టాన్లీ, సిటీగ్రూప్‌, వెల్స్‌ ఫార్గో, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వంటి దిగ్గజ సంస్థలే గుర్తుకొస్తాయి. కానీ వేల సంఖ్యల్లో ఖాతాదారులు,  డిపాజిట్లలో ఎటువంటి భారీతనం లేని ఓ  చిన్న బ్యాంకు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.  ఇంతకీ ఆ బ్యాంకు పేరు ఎంటంటే..  కెంట్‌ల్యాండ్ ఫెడరల్‌ సేవింగ్స్‌ అండ్‌ లోన్‌. 

ఇదే ఆమెరికాలో అతి చిన్న బ్యాంకు

ఇదే ఆమెరికాలో అతి చిన్న బ్యాంకు. 1920లో మొదలైన ఈ బ్యాంకు అప్పటినుంచి ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతోంది.   ప్రస్తుతం ఆ బ్యాంకు మొత్తం ఆస్తుల విలువ కేవలం 3 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 25 కోట్లు అన్నమాట.  ఇక ఈ బ్యాంకులో  ఇద్దరు ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారు. ఇండియానాలోని కెంట్‌ల్యాండ్‌లో మొదట్నుంచీ ఉన్న ఒకే ఒక్క బ్రాంచి మాత్రమే ఇప్పటికీ కొనసాగుతోంది. 

ఏటీఏం సౌకర్యాలు లేదు

ఈ బ్యాంకు మూడు రకాల సేవలను మాత్రమే అందిస్తుంది.  పొదుపు ఖాతాను తెరవడం,  స్థిరాస్తిని ఋణంగా పెట్టుకోవడం, డిపాజిట్‌ సర్టిఫికెట్ తెరవడం. ఈ బ్యాంక్‌కు ఏటీఏం వంటి సౌకర్యాలు లేవు. ఆన్‌లైన్‌ లావాదేవీలు చేసుకుందామంటే కనీసం వెబ్‌సైట్‌ కూడా లేదు. అందుకే వీరు లావాదేవీలు నిర్వహించడానికి ఎలాంటి రుసుములు తీసుకోరు. బ్యాంకింగ్‌ రంగం బాగా అభివృద్ధి చెందినప్పటికీ ఇంకా ఈ బ్యాంకులో  చెక్కులను రాయడానికి కూడా  సంప్రదాయ కోడింగ్‌ మెషీన్లనే వినియోగిస్తున్నారట.  

ఆదాయం కూడా క్రమంగా తగ్గిపోతోందట

1920 చివర్లో స్టాక్‌ ఎక్సేంజ్‌ ఘోరంగా పడిపోయినా తమ బ్యాంక్‌ సేవలు కొనసాగాయని ప్రస్తుత సీఈవో జేమ్స్‌.ఎ. సమన్స్‌ తెలిపారు. ప్రస్తుతం ఆయన వయసు 55 ఏళ్లు. బ్యాంకింగ్‌ నిబంధనలు కఠినతరం చేయడం, ఇతర బ్యాంకుల పోటీ ఎక్కువ కావడంతో ఇటీవల ఈ చిన్న బ్యాంక్‌కు వచ్చే ఆదాయం కూడా క్రమంగా తగ్గిపోతోందని ఆయన తెలిపారు. 

ఎవరీ జేమ్స్

 ఈ జేమ్స్‌ ఎవరో కాదు ఆ బ్యాంక్‌కు నాలుగో తరం సీఈవో. తన పూర్వీకులైన హ్యూమ్‌ సమన్స్‌, జార్జ్‌ సమన్స్‌, జేమ్స్‌.ఇ. సమన్స్‌ల వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. ఈ బ్యాంకింగ్‌ వ్యాపారం తన జనరేషన్‌తోనే అంతమైపోతుందేమోనన్న భయం కూడా ఆయన  పట్టుకుందట.