మంచిర్యాల, వెలుగు: జిల్లా వార్షిక రుణ ప్రణాళికల టార్గెట్లను బ్యాంకర్లు రీచ్ కావడం లేదు. ప్రభుత్వం వివిధ రంగాలకు నిర్దేశించిన మేరకు రుణాలు అందించలేకపోతున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం భారీగా టార్గెట్లు ప్రకటిస్తున్నా ఆచరణలో ఆమడదూరంలో ఉంటున్నారు. ప్రాధాన్య రంగాల్లో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలకు రుణాల మంజూరులో వెనుకబడుతున్నారు. ప్రాధాన్యేతర రంగాలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో టార్గెట్‌కు మించి లోన్లు శాంక్షన్ చేస్తున్నారు. బ్యాంకు లోన్ల సద్వినియోగంపై రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తగిన అవగాహన లేకపోవడం... బ్యాంకర్లు సెక్యూరిటీలు, రకరకాల కండీషన్లతో కొర్రీలు పెడుతుండడంతో రుణ ప్రణాళికల లక్ష్యాలను అందుకోలేకపోతున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్య రంగాలకు రూ.3,409 కోట్లు కేటాయించగా, రూ.1,672 కోట్ల లోన్లు (49.05 శాతం) మాత్రమే శాంక్షన్ చేశారు.
ప్రాధాన్య రంగాల్లో పూర్...
ప్రాధాన్య రంగాల్లో ఒకటైన వ్యవసాయానికి ప్రభుత్వం నిర్దేశించిన మేరకు రుణాలు అందడం లేదు. క్రాప్ లోన్లతో పాటు టర్మ్ లోన్ల మంజూరు టార్గెట్‌ను రీచ్ కావడం లేదు. గత ఆర్థిక సంవత్సరం వానాకాలం సీజన్లో క్రాప్‌లోన్ల టార్గెట్ రూ.1,028 కోట్లకు గాను రూ.796 కోట్లు (77.45 శాతం) శాంక్షన్ చేశారు. యాసంగి సీజన్లో రూ.685 కోట్ల లక్ష్యానికి గాను రూ.416 కోట్లు మంజూరు చేసి 60.83శాతం టార్గెట్ సాధించారు. రైతులకు ఆశించిన మేరకు పంట రుణాలు అందకపోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. అగ్రికల్చర్ టర్మ్ లోన్ల లక్ష్యానికి, ఆచరణకు అసలు పొంతనే లేకపోవడం గమనార్హం. కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.805 కోట్ల టర్మ్ లోన్లు అందించాల్సి ఉండగా, రూ.120 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ల్యాండ్ డెవలప్మెంట్, బోర్ల తవ్వకాలు, ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర పరికరాల కొనుగోళ్లు, గోడౌన్ల నిర్మాణం వంటివి టర్మ్ లోన్ల పరిధిలోకి వస్తాయి. డిమాండ్ మేరకు టర్మ్ లోన్లు మంజూరు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ రైతులే ముందుకు రావడం లేదని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. మైక్రో, స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ ఇండస్ట్రీలకు రూ.541 కోట్లకు గాను రూ.308 కోట్లు అందజేశారు.
టార్గెట్ కు మించి ప్రాధాన్యేతర లోన్లు...
జిల్లా వార్షిక రుణ ప్రణాళికలలో ప్రాధాన్యేతర రంగాల లోన్లకు ఎక్కువ డిమాండ్ ఉన్నప్పటికీ కేటాయింపులు చాలా తక్కువగా ఉంటున్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి కేవలం రూ.260 కోట్లు కేటాయించారు. ఈ పరిధిలోకి వచ్చే హౌసింగ్, పర్సనల్, ఇతర లోన్లు టార్గెట్‌కు మించి అందజేశారు. 303.53 శాతంతో రూ.781.21 కోట్ల లోన్లు ఇవ్వడం విశేషం. అలాగే 9,374 స్వయం సహాయక సంఘాలకు రూ.350 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా, 7,805 సంఘాలకు రూ.388.42 కోట్లు అంటే రూ.38.42 కోట్లు అందనంగా అందించారు. ముద్ర లోన్ల కింద 9443 మందికి రూ.71.31 కోట్లు, స్టాండప్ ఇండియాలో 71 పరిశ్రమలకు రూ.18 కోట్లు, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీం కింద 74 ప్రాజెక్టుల లక్ష్యానికి గాను 84 ప్రాజెక్టులకు సబ్సిడీ లోన్లు మంజూరు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2016 నుంచి 2019 వరకు 153 యూనిట్లు గ్రౌండింగ్ కావాల్సి ఉంది.
ఈ ఏడాది రుణ లక్ష్యం రూ.4,295 కోట్లు...
2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.4,295 కోట్లతో జిల్లా రుణ ప్రణాళికను కలెక్టర్ భారతి హోళికేరి మంగళవారం రిలీజ్ చేశారు. అగ్రికల్చర్ షార్ట్ టర్మ్ లోన్లు రూ.1,951 కోట్లు, లాంగ్ టర్మ్ లోన్లు రూ.952 కోట్లు, మైక్రో, స్మాల్, మీడియం స్కేల్ లోన్లు రూ.687 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.120 కోట్లు, ప్రాధాన్య రంగ హౌసింగ్ లోన్లు రూ.237 కోట్లు, మొత్తం ప్రాధాన్య రంగాలకు రూ.3,996 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.299 కోట్లు కేటాయించారు. 8,333 మహిళా సంఘాలకు రూ.358 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.
