వడ్ల పైసలు తీసుకోలేక అన్నదాతకు అవస్థలు

వడ్ల పైసలు తీసుకోలేక అన్నదాతకు అవస్థలు

మెదక్​ (నిజాంపేట, శివ్వంపేట), వెలుగు : వానాకాలం పంటల సాగు పనులు ఊపందుకున్నాయి.  పొలం దున్నేందుకు ట్రాక్టర్​ కిరాయి, ఎరువులకు, కూలీ ఖర్చులకు పైసలు అవసరం ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడికి వారికి యాసంగి వడ్ల పైసలు, రైతుబంధు డబ్బులే దిక్కు. ఈ పరిస్థితుల్లో బ్యాంకర్లు అకౌంట్​లు ఫ్రీజ్​ చేయడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నిజాంపేట మండలం కల్వకుంట సెంట్రల్ బ్యాంక్ , నిజాంపేట ఏపీజీవీబీ, రామాయంపేట ఏపీజీవీబీ, కొల్చారం కెనెరా బ్యాంక్​లలో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది.  కొన్ని చోట్ల బ్యాంకర్లు క్రాప్ లోన్ వడ్డీ కడితే అకౌంట్లను ఫ్రీజ్ నుంచి తొలగిస్తున్నారు. మరికొన్ని చోట్ల మొత్తం లోన్ క్లియర్ చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో లోన్​లు కట్టలేదని, ఇప్పుడు బ్యాంకర్లు ఇలా ఇబ్బంది పెట్టడమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్మితే వచ్చిన పైసలు చేతికందకుండా చేయడం దారుణమని వాపోతున్నారు.

అదనుకు డబ్బులు అందకపోవడంతో..

వానాకాలం పంట సాగుకు అదనుకు డబ్బులు అందకపోవడంతో ప్రైవేటుగా అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బ్యాంక్ లో లోన్ తీసుకుని రెన్యూవల్ చేయని రైతుల అకౌంట్లను మాత్రమే ఫ్రీజ్ చేస్తున్నామని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.  రైతులను కన్విన్స్ చేసి వారి నుంచి వడ్డీ మాత్రమే వసూలు చేస్తున్నామని అంటున్నారు. గతేడాది కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో బ్యాంకర్లు ఇలా వడ్ల పైసలు, రైతుబంధు పైసలు డ్రాచేసుకోకుండా అకౌంట్లు ఫ్రీజ్​ చేయడం, ఆ పైసలు మిత్తీ కిందికి జమ కట్టుకోవడం లాంటి ఘటనలు జరిగాయి. కాగా ఆర్థిక శాఖ  మంత్రి హరీశ్​రావు ఇలా రైతుల అకౌంట్లు ఫ్రీజ్​ చేయొద్దని బ్యాంకర్లను ఆదేశించారు. అయినా ఈసారి అదే పరిస్థితి నెలకొనడం గమనార్హం. ప్రభుత్వం వెంటనే స్పందించి అకౌంట్లు ఫ్రీజ్​ చేయకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. 

రుణ మాఫీ చేయకనే ఈ తిప్పలు

రైతులకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పి చేయకపోవడంతోనే ఈ తిప్పలొచ్చింది. రైతుబంధు కింద ఇచ్చే పైసలను కూడా బ్యాంకొళ్లు తీసుకోనివ్వట్లె..  లోన్ రెన్యూవల్ చేయాల్సిందే అంటున్రు. ఏంజేయాలో తెలుస్తలేదు.

-  బాస అంజయ్య, రైతు, కల్వకుంట

రెన్యూవల్ కంపల్సరీ..

రైతులు ప్రతి ఏటా తమ  క్రాప్ లోన్లను రెన్యూవల్ చేసుకోవాల్సిందే. సంవత్సరం లోపు లోన్​ లను రెన్యూవల్ చేసుకుంటే బ్యాంక్ తిరిగి 3 శాతం వడ్డీ  రైతుకు వాపస్ ఇస్తుంది. రైతుబంధు, పీఎం కిసాన్​, వడ్ల పైసలు అకౌంట్​లలో పడిన రైతులను  కన్విన్స్ చేసి లోన్​ లను  రెన్యూవల్ చేయిస్తున్నాం.

-  సుధీర్​ కుమార్,కల్వకుంట సెంట్రల్ బ్యాంక్ మేనేజర్