బన్సీలాల్​పేట మెట్లబావి ఓపెనింగ్​కు రెడీ

బన్సీలాల్​పేట మెట్లబావి ఓపెనింగ్​కు రెడీ

బన్సీలాల్ పేటలోని నాగన్నకుంటగా పిలవబడే మెట్లబావి ఓపెనింగ్​కు రెడీ అయింది. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్​యాదవ్​ సోమవారం సాయంత్రం ప్రారంభించనున్నారు. నిజాం కాలంలో ఈ మెట్లబావిలోని నీటిని స్థానికులు తాగేందుకు ఉపయోగించేవారని అక్కడున్న ఆధారాలు ద్వారా తెలుస్తోంది. నిర్వహణ లేక కాలక్రమేణ చెత్త చెదారంతో నిండిపోగా, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సాహే అనే సంస్థ గతేడాది ఆగస్ట్15న పునరుద్ధరణ చేపట్టింది. దాదాపు 16 నెలలు పాటు పనులు కొనసాగాయి. సుమారు 500 ట్రక్కుల చెత్తను తొలగించారు. ప్రస్తుతం నీటితో కళకళలాడుతోంది. పర్యాటకులను ఆకర్షించేలా అధికారులు బావి పరిసరాలను తీర్చిదిద్దారు. చుట్టుపక్కల భవనాలకు ఒకే రకమైన రంగు వేశారు. 

చారిత్రక బన్సీలాల్​పేట కమాన్​కు రిపేర్లు చేశారు. చిన్నచిన్న వేడుకలు నిర్వహించుకొనేలా బావిని ఆనుకొని సీటింగ్​తో కూడిన గార్డెన్, యాంఫీ థియేటర్(టూరిస్ట్ ప్లాజా) నిర్మించారు. బావి చరిత్రను తెలిపే సమాచారం, ఫొటోలు, పూడిక తీసే టైంలో లభ్యమైన కొన్ని వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. బావిలో పురావస్తు శాఖ నిబంధనలను అనుసరించి స్పెషల్​ లైటింగ్ ఏర్పాటు చేశారు. పురాతన మెట్లబావిని పునరుద్ధరించి పూర్వవైభవం తెచ్చి, భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేయడం అభినందనీయం అని ప్రధాని మోడీ ఈ ఏడాది మార్చి 27న ‘మన్​కీ బాత్’లో కొనియాడారు. 

- వెలుగు, పద్మారావునగర్