
Vodafone Idea: భారతదేశ టెలికాం వ్యాపారంలోకి ముఖేష్ అంబానీకి చెంది రిలయన్స్ జియో అడుపెట్టడం పెద్ద ప్రకంపనలనే సృష్టించిన సంగతి తెలిసిందే. డొకోమో నుంచి ఎయిర్ సెల్ వరకు అనేక కంపెనీలు ఈ రంగంలో పోటీని తట్టుకోలేక మాయమైపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రైవేటు ఆపరేటర్లైన ఎయిర్ టెల్, వొడఫోన్ ఐడియా మాత్రమే జియోతో పోటీని తట్టుకుని నిలబడ్డాయి. అయితే ఈ సంస్థల ఆర్థిక పరిస్థితి కూడా అంతగా బాలేదన్న విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం భారీ నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడఫోన్ ఐడియా కూడా ఎక్కువ కాలం ఇలా కొనసాగటం కష్టమేనని తేలిపోయింది. ఇదే విషయాన్ని కంపెనీ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి వెల్లడించారని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకుంటే కంపెనీని ఈ ఆర్థిక సంవత్సరం వరకు మార్తమే నడపగలమని ఆ తర్వాత దివాలాకు వెళ్లాల్సి ఉంటుందని వెల్లడించినట్లు తేలింది. ఈక్విటీల కన్వర్షన్ తర్వాత కూడా విఐ స్పెక్ట్రమ్ బకాయిలు ప్రభుత్వానికి రూ.లక్ష 95వేల కోట్లుగా ఉండటం ఆందోళలు పెంచుతోంది.
ALSO READ | రూ.30 వేల కోట్ల బకాయిలు మాఫీ చేయండి.. సుప్రీంకోర్టులో వొడాఫోన్ ఐడియా పిటిషన్
ప్రస్తుతం భారత ప్రభుత్వానికి వొడఫోన్ ఐడియాలో 49 శాతం వాటా ఉండగా.. కంపెనీ దేశంలోని టెలికాం యూజర్లలో 18 శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం దిగజారుతున్న పరిస్థితుల్లో రుణదాతల నుంచి మద్దతు లభించడం లేదని టెలికాం మేజర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఒకవేల కంపెనీ దివాలా ప్రక్రియ స్టార్ట్ చేసేందుకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ వద్దకు వెళితే దాదాపు 20 కోట్ల మంది టెలికాం యూజర్లు ప్రభావితం అవుతారని తెలుస్తోంది. ఇదే క్రమంలో కంపెనీలో పనిచేస్తున్న 20వేల మంది ఉద్యోగుల పరిస్థితిపై కూడా ఆందోళనలు రేకెత్తుతున్నాయి.
దీనికి ముందు టెలికాం సంస్థ రూ.30వేల కోట్ల స్పెక్ట్రమ్ బకాయిలను మాఫీ చేయాలని కోరుతూ చేసిన కొత్త పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు విచారించేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెలికాం కంపెనీ తన ఏజీఆర్ బకాయిలకు సంబంధించిన వడ్డీ, జరిమానాల రూపంలో విధించిన రూ. 30వేల కోట్లను మాఫీ చేయాలని కోరింది. కేంద్రం వడ్డీ బకాయిలపై వడ్డీ చెల్లించాలని పట్టుబట్టకుండా నిరోధిస్తూ ఆదేశాలు జారీ చేయమని కోర్టును కంపెనీ కోరింది. రూ.93వేల520 కోట్ల ఏజీఆర్ బకాయిలను చెల్లించడంలో ఇబ్బంది పడుతున్న టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన మెుత్తాలకు 10 ఏళ్ల కాలపరిమితిని కూడా సుప్రీంకోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. మెుత్తానికి వొడఫోన్ బతుకుతుందా లేక దివాలా తీస్తుందా అనేది ప్రభుత్వం అందించే సహాయంపైనే ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది.