బంగ్లా అభిమానుల ఆగడాలు.. టీమిండియా కెప్టెన్‌కు ఘోర అవమానం

బంగ్లా అభిమానుల ఆగడాలు.. టీమిండియా కెప్టెన్‌కు ఘోర అవమానం

ఆటలో గెలుపోటములు ఎంత సహజమో.. ఆశించిన నిర్ణయాలు రానప్పుడు ఆటగాళ్లు అసహనం ప్రదర్శించటం అన్నది అంతే సహజం. ప్రతి క్రీడలోనూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అయితే తదుపరి మ్యాచ్‌కు వచ్చేసరికి ఇవన్నీ ఎవరికీ గుర్తుండవు. పాత ఘటనలు మరిచిపోతూ ఆడుతున్న మ్యాచ్‌లో విజయం కోసం పోరాడుతుంటారు. కానీ, బంగ్లా అభిమానుల ఆగడాలు చూస్తుంటే అలా కనిపించడం లేదు. వివాదాల వైపు మొగ్గుచూపుతున్నట్లు ఉంది. 

జూలై 22న శనివారం భారత్, బంగ్లాదేశ్ మహిళా జట్ల మధ్య జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డే వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అంపైర్ల తప్పుడు నిర్ణయాలు.. భారత జట్టు విజయానికి అడ్డుపడ్డాయి. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. అంపైర్ల నిర్ణయాలపై అసహనంతో ఉన్న భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. మ్యాచ్‍ ప్రజంటేషన్‌లో ఈ విషయాన్ని నొక్కి చెప్పింది. అంపైర్ల నిర్ణయాలు తమను ఆశ్చర్యపరిచాయని తెలిపిన టీమిండియా కెప్టెన్‌.. భవిష్యత్తులో మరోసారి బంగ్లా పర్యటనకు వచ్చినప్పుడు ఇలాంటి అంపైరింగ్‍కు తగ్గట్టుగా సన్నద్ధమవుతామని చెప్పుకొచ్చింది.

అయితే ఈ వ్యాఖ్యలను బంగ్లా అభిమానులు వక్రీకరిస్తున్నారు. భారత మహిళా జట్టు సాధించిన విజయాలన్నీ.. అంపైర్ల చలువ వల్లే గెలిచిందంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను 'క్రై బేబీ'గా.. మహిళా ఆటగాళ్లను 'క్రై బేబీస్' గా చిత్రీకరిస్తూ ఘోరంగా అవమానిస్తున్నారు.

ఈ పోస్టులకు భారత అభిమానులు అదే రీతిలో కౌంటరిస్తున్నారు. బంగ్లా ఆటగాళ్లకు నాగిని డ్యాన్స్ తప్ప ఆట రాదని, అందువల్లే అంతర్జాతీయ ఇప్పటివరకు ఒక్కసారి విజేతగా నిలవలేకపోయిందని ఎద్దేవా చేస్తున్నారు. ఇరు దేశాల అభిమానుల మధ్య ఈ వివాదం చిలికిచిలికి గాలివానగా మారేలా ఉంది.

ఇక బంగ్లా పర్యటనలో టీమిండియా మూడు మ్యాచుల టీ20 సిరీస్‪ను 2-1 తేడాతో సొంతం చేసుకోగా.. వన్డే సిరీస్‌ను 1-1తో సరిపెట్టుకుంది.