
బర్రెలక్క ఏంటి అని తిట్టుకోకండి! మనం ఠక్కున ఆమె అసలు పేరు చెప్పేస్తే కొందరు గుర్తుపట్టకపోవచ్చు. ఆమె నిర్ణయం మరింత మందికి చేరువయ్యేందుకే ఇలా.. రెండేళ్ల కిందట హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బర్రెలక్కను. డిగ్రీ చదివాను.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో మా అమ్మను అడగి బర్రెలు కొనిపించుకున్నాను.. అంటూ ఒక వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేసింది. గుర్తుందా! ఆ వీడియోలోని బర్రెలక్క అలియాస్ శిరీష(princes_siri_barrelakka).
మొత్తానికి ఈ నిరుద్యోగి(శిరీష) రాజకీయాల్లోకి ప్రవేశించింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం నామినేషన్ దాఖలు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన శిరీష.. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు తాను ఎన్నికల బరిలో నిలిచానని పేర్కొంది. "ఒక తెలంగాణ నిరుద్యోగినిగా నామినేషన్ వేశాను. నేను ఈ ఎన్నికల్లో ప్రచారం చేయలేక పోవచ్చు.. డబ్బు పంచలేక పోవచ్చు.. కానీ ఓటర్లైన ప్రజలు ఏది మంచి ఏది చెడు అనేదిఆలోచించాలి. నాకు మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నా.. అని ప్రజలను అభ్యర్థించింది.
నెటిజెన్ల మద్దతు
ఒక నిరుద్యోగిగా శిరీష నామినేషన్ వేయడాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇలా ధైర్యం చేసి వందల మంది నామినేషన్లు దాఖలు చేస్తే ప్రభుత్వాలు దిగొస్తాయని, ప్రజల్లో మార్పు వస్తుందని ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.
నామినేషన్ వేసిన బర్రెలక్క
— Telugu Scribe (@TeluguScribe) November 8, 2023
రీల్స్ ద్వారా ఫేమస్ అయిన బర్రెలక్క ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి నామినేషన్ వేసింది. pic.twitter.com/LuphFWHGcS