తమ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియచేసేందుకు మంత్రి సబిత ఇంటికి వచ్చామని.. కానీ ఆమె ఇంట్లో లేరని పోలీసులు చెబుతున్నారని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. వినతిపత్రం ఇవ్వడానికి తాము వస్తే.. ఎందుకు అరెస్టు చేస్తున్నారని నిలదీశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి సబిత ఇంటి ఎదుట వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారికి పోలీసులు సూచించారు. తాము మంత్రి సబితను కలిసి వినతిపత్రం ఇచ్చి.. సమస్యలను తెలియచేస్తామని తల్లిదండ్రులు విన్నవించారు. కానీ.. పోలీసులు వినిపించుకోలేదు. సబిత ఇంట్లో లేరంటూ బలవంతంగా వారిని పోలీసు వ్యాన్ లలో ఎక్కించారు. పోలీసుల తీరును తల్లిదండ్రులు ఎండగట్టారు.
చదువుకోవడానికి పంపించాం.. చంపుకోవడానికి కాదు
పిల్లలవి సిల్లీ కోరికలు అయితే.. ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేదని సూటిగా ప్రశ్నించారు. తమ పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను చదువుకోవడానికి పంపించాం.. చంపుకోవడానికి కాదన్నారు. సమస్యలను పరిష్కరించకపోతే.. తాము నిరహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు లేదా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
సమస్యలు పరిష్కరించాలంటూ.. ట్రిపుల్ ఐటీ E1, E2 విద్యార్థులు శనివారం రాత్రి నుంచి నిరసన చేశారు. రాత్రి భోజనం చేయకుండా తెల్లారి 3 గంటల వరకు మెస్ లో జాగారం చేశారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా చేయకుండా ఆందోళన కంటిన్యూ చేశారు. ఐదు డిమాండ్లపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఐదు డిమాండ్లలో ఒకటైన మెస్ ఇష్యూపై వెంటనే స్పందించి.. మెస్ టెండర్లు పిలిచారు. మిగితా 4 డిమాండ్లపై నిలదీస్తున్నారు విద్యార్థులు.
