బాసర, వెలుగు : వసంత పంచమి వేడుకలకు బాసర జ్ఞాన సరస్వతీ ఆలయం ముస్తాబైంది. వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక పూజలు ప్రారంభించనున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రామారావు పటేల్ సరస్వతీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. వేడుకల కోసం ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు.
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. వీఐపీలు వచ్చినా సాధారణ భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశామని ఈవో అంజనాదేవి తెలిపారు.
క్యూలో ఉండే భక్తులకు ఆలయం తరఫున పాలు, పండ్లు పంపిణీ చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్షరభ్యాస మండపం, గర్భగుడి, ప్రధాన ద్వారం, టికెట్ల కౌంటర్, లడ్డూ ప్రసాద విక్రయ కౌంటర్, గోదావరి పుష్కరఘాట్ల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
