వర్ధన్నపేట(ఐనవోలు), వెలుగు : ‘రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రతి ఆలయాన్ని డెవలప్ చేస్తున్నం, బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేస్తాం’ అని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఆలయాల అభివృద్ధిపై సబ్ కమిటీ వేయడంతో పాటు సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక ఎమ్మెల్యే కేఆర్.నాగరాజుతో కలిసి మంత్రి కొండా సురేఖ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి, ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఐనవోలు అభివృద్ధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు విజ్ఞప్తి మేరకు ఆలయ అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. భక్తులు సమర్పించిన బంగారంతో ఆభరణాలు చేయించి స్వామివారికి ముస్తాబు చేస్తామని చెప్పారు. ప్రజల నమ్మకాలపై తమకు గౌరవం ఉందన్నారు.
మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని రూ.250 కోట్లతో డెవలప్ చేస్తున్నామని గుర్తు చేశారు. ఐనవోలులోని ఆలయ భూమిలో హరిత హోటల్ నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. టూరిజంలో రాష్ట్రాన్ని నంబర్‌వన్ ప్లేస్‌లో నిలిచి ఆదాయం పెంచుతామన్నారు.
