బతుకమ్మ స్పెషల్​.. జగిత్యాలలో రెండు సార్లు బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ స్పెషల్​.. జగిత్యాలలో రెండు సార్లు బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పూల పండుగ.  తెలంగాణలో ఆడవాళ్లందరూ కలిసి జరుపుకునే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. రాష్ట్రమంతటా ప్రజలు ఒకేసారి ఈ పండుగను జరుపుకుంటారు. కానీ, జగిత్యాల, వరంగల్​ అర్బన్​ జిల్లా హసన్​ పర్తి మండలంలోని సీతంపేట గ్రామంలో రెండు సార్లు బతుకమ్మ సంబరాల సందడి కనిపిస్తుంది.

సీతంపేట గ్రామంలోని  నేతకాని కుటుంబాలు దీపావళి పండుగ నుంచి మూడు రోజుల పాటు బతుకమ్మ సంబురాలు చేస్తుంటారు. గంగ స్నానాలు చేసి రేగడి మట్టితో జోడెడ్ల బొమ్మలు తయారు చేసే సంప్రదాయంతో మొదలయ్యే ఈ సంబురాలు బతుకమ్మ నిమజ్జనంతో ముగుస్తాయి. పంటలు సమృద్ధిగా పండటంతో పాటు జనం సుఖసంతోషాలతో ఉండాలని ఇలా సంప్రదాయబద్ధం గా ఉత్సవాలు చేస్తామని సీతంపేట ఊరివాళ్లు చెప్తున్నారు. 

ALSO READ : Bathukamma Special : బతుకమ్మ పూలు ఇచ్చే ఆరోగ్యం, వాటి ఔషధ గుణాలు ఇవే

ఇక,  జగిత్యాల జిల్లాలో  ఆడబిడ్డలు అత్తారంట్లో, తల్లిగారింట్లో.. రెండు చోట్లా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతోనే రెండు సార్లు బతుకమ్మ పండుగ చేయడం మొదలుపెట్టారు. జిల్లాలోని  సగం ఊళ్లలో దసరాకు ముందు బతుకుమ్మ పండుగ చేస్తారు. జిల్లాలోని జగిత్యాల, మల్యాల, గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మపురి, వెల్గటూర్, బుగ్గారం మండలాల్లో దసరాకు ఒకరోజు ముందు పండుగ చేస్తారు.  జిల్లాలోని రాయికల్​, మేడిపల్లి, కథలాపూర్, కోరుట్ల, మెట్​ పల్లి, ఇబ్రహింపట్నం, మల్లాపూర్​ మండలాల్లో దసరా తర్వాత బతుకమ్మ పండుగ చేస్తారు.