బతుకమ్మ పూలు.. వాటి ఔషధ గుణాలు

బతుకమ్మ పూలు.. వాటి  ఔషధ గుణాలు

బతుకమ్మ అనగానే రంగురంగుల పూలు కళ్లముందుకొస్తాయి. మామూలుగానే ఆడవాళ్లకు పూలంటే చాలా ఇష్టం. అలాంటిది పూల పండుగ అంటే... ఆ హడావిడి మాటల్లో చెప్పలేం. ఈ సీజన్​లో దొరికే పూలన్నీ తెచ్చి, ఆ పూలతో బతుకమ్మను అలంకరించడం, ఆడవాళ్లంతా అందంగా ముస్తాబై బతుకమ్మ ఆడటం ఎంతో సంబురంగా ఉంటుంది. బతుకమ్మ పండుగ సీజన్‌‌లో దొరికే ఆ పువ్వుల్లో ఎన్నో రకాల మెడిసినల్ వాల్యూస్​ ఉన్నాయి. చర్మ, కీళ్ల వ్యాధులు, షుగర్​, లంగ్​, గొంతు ప్రాబ్లమ్స్​ తగ్గుతాయి. బతుకమ్మలో వాడే ఆ పూలు, వాటి స్పెషాలిటీ, మెడిసినల్​ వాల్యూస్ గురించిన వివరాలు ఇవి... 

పసిడి రంగు పూలు తంగేడు

బతుకమ్మ అనగానే మొదట గుర్తొచ్చేవి తంగేడు పూలు. బతుకమ్మలో మొదట పేర్చేది ఈ పూలే. ఆకుపచ్చని ఆకుల మధ్య పసిడి రంగులో మెరిసే ఈ తంగేడు పూలు హెల్త్​కు చాలా మేలు చేస్తాయి. తంగేడు సైంటిఫిక్​ పేరు ‘కేసియా అరికులేటా’. తంగేడు పూలతో టీ చేసుకుని తాగితే ఆడవాళ్లలో నెలసరి సైకిల్ క్రమం తప్పిపోదు. ఈ పూలు షుగర్​ని కంట్రోల్​లో ఉంచుతాయి. కీళ్ల నొప్పులు తగ్గించడానికి కూడా పని చేస్తుంది. తంగేడు కషాయం బాడీకి చల్లదనాన్నిస్తుంది. తంగేడును నీటిలో వేయడం వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది. 

రాఖీ పువ్వు 

రాఖీ పుష్పం ‘ఫాసిప్లోరేసి’ కుటుంబానికి చెందిన పువ్వుని ‘పాండవుల పువ్వు’ అని కూడా అంటారు. ఈ పూలను మందుల తయారీలో ఎక్కువగా వాడతారు. స్ట్రెస్​ను తగ్గించే మెడిసిన్స్​ తయారీలో కూడా దీన్ని వాడతారు. 

మందారం 

మందారం సైంటిఫిక్ పేరు ‘హైబిస్కస్’. మాల్వేసి కుటుంబానికి చెందిన ఈ పువ్వుతో తయారు చేసే నూనెను వాడితే వెంట్రుకలు నల్లబడతాయి. బ్యూటీ ప్రొడక్ట్స్​ తయారీలో కూడా వాడతారు. 

స్వచ్ఛతకు గుర్తు తామర పువ్వు

అందానికి, స్వచ్ఛతకు గుర్తు తామర పువ్వు. దీని సైంటిఫిక్ పేరు ‘నెలంబో నుసిఫెరా’. సుగంధ ద్రవ్యాల తయారీకి, కాన్​స్టిపేషన్​తో బాధపడేవారికి తామర నూనె బాగా పనిచేస్తుంది. అంతేకాదు ఈ పువ్వుతో చాలా రకాలైన స్కిన్​ అలర్జీలు తగ్గిపోతాయి. షుగర్​ కూడా తగ్గుతుందంటారు. దాంతోపాటు లివర్, బ్రెయిన్​ హెల్త్​ని కాపాడుతుంది. తామర గింజల్ని కూడా తింటారు. వీటిని రోజూ ఏదో విధంగా ఫుడ్​లో భాగం చేసుకుంటే హెల్త్‌‌కి చాలా మంచిదట. 

బీరపువ్వు

బీరపువ్వు సీజనల్ ఫ్లవర్. దీని సైంటిఫిక్​ పేరు ‘లుఫా’. బీరకాయలను ఎండబెట్టి అందులో ఏర్పడే పీచును రంగుల్లో వాడతారు. బతుకమ్మను పేర్చేటప్పుడు నుదుటన తిలకం దిద్దినట్లుగా బీరపువ్వును పెడతారు. 

రుద్రాక్ష పువ్వు

రుద్రాక్ష పువ్వు సైంటిఫిక్​ పేరు ‘ఎలియోకార్పస్​ జనిట్రస్​’. కేక్, జెల్లి తయారీలోనూ పూలు వాడతారు. నీళ్లలో రుద్రాక్ష గింజలు వేసి స్నానం చేస్తే చర్మ వ్యాధులు రావు. పుండ్లు, గాయాలను నయం చేస్తుంది.

సీత జడ పూలు

సీత జడ పూలను నారలు, రంగుల తయారీలో వాడతారు. సిలోసియా అరిగేటియా అమరాంథస్ దీని సైంటిఫిక్​ పేరు. 

గునుగు... గడ్డి పువ్వే.. కానీ 

గునుగు పూలను కోడిజుట్టు పూలని కూడా అంటారు. ‘సెలోషియా’ దీని సైంటిఫిక్​ పేరు. ఇది గడ్డి జాతి పువ్వే.. కానీ, ఈ పూలమొక్క ఆకు కూర కూడా. దీని ఆకుల్ని కూర చేసుకుని తింటే నార్మల్​ డెలివరీ అవుతుందంటారు. పల్లెల్లో దీని గురించి తెలిసిన వాళ్లు తప్పకుండా తింటారు. ఈ పూలు చర్మంపై గాయాలు, పొక్కుల్ని తగ్గిస్తాయి. దగ్గు, టీబీ, డయేరియాలను కూడా తగ్గిస్తాయి ఈ పూలు. బీపీని కంట్రోల్​లో ఉంచుతాయి. పూలు, ఆకులే కాదు, ఈ గింజల్ని కూడా తినొచ్చు. వాటివల్ల యూరినరీ ఇన్​ఫెక్షన్స్​ తగ్గిపోతాయట. ఈ మొక్కను పశువులకు దాణాగా వాడతారు.  

బంతి 

బంతిపువ్వు ఆస్టరేసి కుటుంబానికి చెందింది. బాడీలోని టెంపరేచర్​ను తగ్గించడానికి పనిచేస్తుంది. క్రిసాంథిమమ్ బయాన్కో దీని సైంటిఫిక్​ పేరు. చలువ పువ్వుగా ఫేమస్ ఇది. బ్లడ్ సర్క్యులేషన్​ను మెరుగు పర్చడానికి తయారు చేసే మెడిసిన్స్​లో ఈ పూలు వాడతారు. 

గుమ్మడి పువ్వు

గుమ్మడి పువ్వులో ఎ, సి విటమిన్లు ఉంటాయి. దీని సైంటిఫిక్​ పేరు ‘కుకుంబిటాపిపో’. వయసు మీద పడ్డాక వచ్చే కాళ్ల నొప్పుల్ని తగ్గిస్తుంది. ప్రొస్టేట్ గ్రంథికి ఎలాంటి హాని కలగకుండా చేస్తుంది. డ్రై స్కిన్​ ఉన్నవాళ్లు వాడితే స్కిన్​కి చాలా మంచిది. 

కట్ల పువ్వు 

కట్ల పువ్వు నీలి రంగులో ఉంటుంది. దీని సైంటిఫిక్​ పేరు ‘జకు మోంటియా నెంటాథోన్’. ఈ పూలలో డయాబెటిస్​, ఇన్​ఫ్లమేషన్, క్యాన్సర్​​ను తగ్గించే గుణాలున్నాయి. ఇవే కాదు, ఈ సీజన్​లో పూసే చామంతి, టేకీ, గులాబీ, సోంపు వంటి పూలన్నీ బతుకమ్మ తయారీలో వాడుకోవచ్చు.