ప్రైవేట్ ల్యాండ్ ఇష్యూలో.. రంగనాథ్ జోక్యమేంటి? : ఎడ్ల సుధాకర్

ప్రైవేట్ ల్యాండ్ ఇష్యూలో.. రంగనాథ్ జోక్యమేంటి? : ఎడ్ల సుధాకర్
  • టైటిల్ ఉందో లేదో తేల్చడానికి ఆయనెవరు?: ఎడ్ల సుధాకర్

అంబర్​పేట, వెలుగు:  బతుకమ్మ కుంట భూమి విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం అంబర్​పేటలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ కుంటలో రూ.5 నుంచి 6 కోట్ల విలువైన మట్టి స్కామ్ జరిగిందని, అంబర్​పేట 100 ఫీట్ల రోడ్డు నిర్మాణం కోసం కాంట్రాక్టర్​కు మట్టిని అమ్ముకున్నారని ఆరోపించారు. బతుకమ్మ కుంట భూమిపై తనకూ, ఇతర ప్రైవేట్ వ్యక్తులకు మధ్య కోర్టులో కేసు నడుస్తుండగా, హైడ్రా చీఫ్ ప్రెస్ మీట్ పెట్టడం కోర్టు ధిక్కరణే అవుతుందని మండిపడ్డారు.

టైటిల్ ఉందా లేదా అని తేల్చడానికి రంగనాథ్ అసలు ఎవరు అని ఆయన ప్రశ్నించారు. కోర్టును తప్పుదోవ పట్టిస్తూ, ప్రైవేట్ ల్యాండ్ ఇష్యూలో తలదూర్చుతున్న రంగనాథ్​పై తక్షణమే చర్యలు తీసుకొని, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోం మంత్రి, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు.

భూ కబ్జాదారులకు మేలు చేసేలా హైడ్రా చర్యలు

అబ్దుల్లాపూర్​మెట్  : హైడ్రా తీసుకుంటున్న చర్యలు భూకబ్జాదారులకు మేలు చేసేలా ఉన్నాయని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం పెద్దఅంబర్​పేటలోని కార్ఖానా కుంట పరిసరాలను, ఇటీవల హైడ్రా కూల్చివేసిన ప్రజయ్ గుల్మోహర్ కాలనీ కాంపౌండ్ వాల్​ను స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడు ఎకరాల పైచిలుకు ఉన్న కార్ఖానా కుంట ప్రస్తుతం రెండు ఎకరాలకు తగ్గిపోయిందని, ఆ కుంటను కాపాడాల్సిన బాధ్యత హైడ్రా, ఇరిగేషన్ అధికారులకు లేదా అని ప్రశ్నించారు.

కబ్జాకు గురైన కుంటను వదిలేసి కాలనీ గోడపై దృష్టి పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.  అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మేలు చేయడం కోసం కాలనీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. బాధితుల తరపున పోరాడుతామని ఆయన హామీ ఇచ్చారు.