
తెలంగాణ ప్రకృతి పండుగ అయిన బతుకమ్మ సంబరాలు ఆరో రోజుకి చేరుకున్నాయి. ఆరో రోజు బతుకమ్మ అత్యంత స్పెషల్. ఎందుకంటే పేరుకి తగిన విధంగా ఆరోజు ఆరాధన విలక్షణంగా ఉంటుంది. మరీ ఇంతకీ ఈ రోజు ఏం చేస్తారంటే...
బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజున అమ్మవారిని 'అలిగిన బతుకమ్మ'గా పిలుస్తారు. చాలాచోట్ల దీన్ని 'అర్రెం'గా కూడా పేర్కొంటారు. పంచమి నాడు అలిగిన బతుకమ్మగా వ్యవహరిస్తారు.
పూర్వకాలంలో బతుకమ్మలను పేర్చే సమయంలో మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందట. అందుకని ఈ రోజు బతుకమ్మ అలిగి ఏదీ తినదం టారు. కాబట్టి ఈ రోజు ( సెప్టెంబర్ 26) పూలతో బతుకమ్మలను తయారు చెయ్యరు. నైవేద్యం కూడా ఏదీ సమర్పించరు. బతుకమ్మ అలక తీరాలని మహిళలందరూ కలిసి ప్రార్థిస్తారు.
అలిగిన బతుకమ్మపై మరో చరిత్ర కూడా ఉంది. దేవీభాగవతం ప్రకారం నవరాత్రుల్లో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాల్లో రాక్షస సంహారం చేసిందని చెబుతారు. భండాసురుణ్ని, చండముండల్ని సంహరించిన తర్వాత అలసిపోయిన అమ్మవారికి ఒక రోజు విశ్రాంతి ఇవ్వాలని ఆరోనాడు బతుకమ్మ ఆడరు. దానినే అర్రెం అనీ, అలసిన బతుకమ్మ అని పిలుస్తా రు. కాలక్రమంలో అదే అలిగిన బతుకమ్మగా పేరు స్థిరపడిపోయింది.
ప్రతి ఏడాది.. భాద్రపద అమావాస్యతో బతుకమ్మ ఉత్సవాలు మొదలవుతాయి. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో పూర్తవుతాయి. తంగేడు, గునుగు లాంటి పూలతో పాటు తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేర్చుతారు. ఈ తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్సవాల్లో ఒక్కో రోజు.. గౌరమ్మకు ప్రత్యేకమైన ప్రసాదాలు సమర్పిస్తుంటారు. ఆడపడుచులంతా ఒకరికొకరు వాయినాలు కూడా ఇచ్చుకోవటం అనవాయితీగా వస్తోంది.
శుక్రవారమునాడు లేచెనే గౌరమ్మ ఉయ్యాలో పాటకు రిలిక్స్
శుక్రవారమునాడు ఉయ్యాలో
లేచెనే గౌరమ్మ ఉయ్యాలో
చన్నీటి జలకాలు ఉయ్యాలో
ఆడెనే గౌరమ్మ ఉయ్యాలో
ముత్యమంత పసుపు ఉయ్యాలో
ముఖమంత పూసింది ఉయ్యాలో
పగడమంత పసుపు ఉయ్యాలో
పాదమంత పూసింది ఉయ్యాలో
చింతాకు పట్టుచీర ఉయ్యాలో
చింగులు మెరియంగ ఉయ్యాలో
మైదాకు పట్టుచీర ఉయ్యాలో
మడిమల్లు మెరియంగ ఉయ్యాలో
పచ్చ పట్టుచీర ఉయ్యాలో
పక్కలు మెరియంగ ఉయ్యాలో
ఎర్ర పట్టుచీర ఉయ్యాలో
ఎముకలు మెరియంగ ఉయ్యాలో
రస బొమ్మల నడుమ ఉయ్యాలో
కుంకుమ బొట్టు ఉయ్యాలో
భారీ బొమ్మల నడుమ ఉయ్యాలో
బొట్టు గోరంట పువ్వుల ఉయ్యాలో
కొడుకు నెత్తుకోని ఉయ్యాలో
బీరాయి పువ్వుల ఉయ్యాలో
బిడ్డ నెత్తుకోని ఉయ్యాలో
రావేరావె గౌరమ్మ ఉయ్యాలో..
రావేరావె గౌరమ్మ మా ఇంటి దాక ఉయ్యాలో