
ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు అమలు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.సెక్రటేరియట్ లో ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. బడుగుబలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. దేశమంతా ఈ రెండు గ్యారంటీల కోసం ఎదురుచూస్తుందన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా హామీల అమలులో వెనకడుగు వేయబోమని తెలిపారు. ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూనే హామీలు అమలు చేస్తున్నామన్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై బీఆర్ఎస్ రోజూ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు భట్టి. 200 యూనిట్లు వాడే వారికి మార్చిలోపు జిరో కరెంట్ బిల్లు వస్తుందని చెప్పారు భట్టి. పథకాల అమలులో ఎలాంటి ఆంక్షలు ఉండవన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే కాంగ్రెస్ లక్ష్యం.. అర్హులు మిగిలి ఉంటే మండలాఫీసుల్లో అప్లై చేసుకోవాలి..ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు భట్టి విక్రమార్క.
రాష్ట్ర చరిత్రలో ఈ రోజు శుభపరిణామం అని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రెండు గ్యారంటీలు మహిళలు మర్చిపోలేని అద్భుత పథకాలన్నారు.
తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు ఉత్తమ్. గ్యాస్ సిలిండర్ ధర ఎంతున్న రూ.500లకే ఇస్తామన్నారు. 40 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. అర్హులు ఎవరైనా ఉంటే బాధపడొద్దని..ఆరు గ్యారంటీల్లో త్వరలోనే మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు.