
గాడిలో పడ్డామన్న కోహ్లీ… రోహిత్, రాహుల్‌పై ప్రశంసల జల్లు
ఎంత టార్గెట్ ఉన్నా.. ఛేజ్ చేస్తారు..! ఎందరు స్టార్లు ఉన్నా… ఫస్ట్ బ్యాటింగ్‌లో బోల్తా కొడతారు..! గత కొన్నేళ్లుగా పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా తీరు ఇది..! స్వదేశంలోనైనా, విదేశాల్లోనైనా.. టాస్ గెలిచి కావాలని ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సందర్భాల్లోనూ మ్యాచ్‌లు ఓడిన సంఘటనలూ ఉన్నాయి..! కానీ వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో మాత్రం ఈ పద్ధతికి బ్రేక్ పడింది..! ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే.. ఇలానే ఆడాలని విరాట్ సేనకు ఈ మ్యాచ్ కొత్త దారి చూపెట్టింది..! ముగ్గురు మొనగాళ్లు ఎగేసి కొట్టిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఫస్ట్.. బిగ్ హిట్ కావడం.. ఎన్నాళ్లుగానో అటు కోహ్లీని, ఇటు అభిమానులను కలవరపెడుతున్న ఓ పెద్ద సవాలుకు జవాబు దొరికినట్లైంది..! మరి దీనిని కొనసాగిస్తారా..?
వెలుగు క్రీడావిభాగం: ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా బలం ఏందంటే బ్యాటింగ్. చాలా ఏళ్ల నుంచి ఇదే వరుస. టెస్ట్‌లు, వన్డేల్లో చాలాసార్లు ఇది నిరూపితమైంది కూడా. కానీ ధనాధన్ ఫార్మాట్‌కు వచ్చేసరికి కొన్నిసార్లు అంచనాలు తప్పాయి. భారీ కాస్టింగ్‌తో బరిలోకి దిగినా.. అనామక జట్ల చేతుల్లో ఓడిన సంఘటనలు ఉన్నాయి. అయితే అది బౌలింగో, ఫీల్డింగ్ తప్పిదాలని సరిపెట్టుకునే చాన్స్ కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయడంలో విరాట్‌సేన చాలాసార్లు విఫలమైంది. లైనప్‌లు మార్చినా, వ్యూహాలు మార్చినా.. వేదికలు మారినా.. కొంతకాలంగా ఈ ఫస్ట్ బ్యాటింగ్ అనే ట్రాజెడీ లైన్ టీమిండియాను వేధిస్తూనే ఉంది. స్టాట్స్ కూడా ఇదే అంశాన్ని చెబుతున్నాయి. సొంతగడ్డపై ఫస్ట్ బ్యాటింగ్ చేసిన 26 మ్యాచ్‌ల్లో కేవలం 12 గెలిచాం. అంటే విజయాల శాతం 46.15. అదే విదేశాల్లో అయితే 37 మ్యాచ్‌లు ఆడితే 25 నెగ్గాం. 67.57 శాతం విజయాలు సాధించాం. సెకండ్ బ్యాటింగ్‌లో టీమిండియా స్టాట్స్‌ను చూస్తే.. స్వదేశంలో 18 మ్యాచ్‌లు ఆడితే 14 విజయాలు. గెలుపు శాతం 77.78గా ఉంది. విదేశాల్లో 42 ఆడితే 28 మ్యాచ్‌లు గెలిచాం. విజయాల శాతం 66.67గా ఉంది. పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా సాధించిన విజయాల్లో ఎక్కువ శాతం ఛేజింగ్‌లోనే వచ్చినవి. మరి ఇది ఇలాగే కొనసాగితే ఆసీస్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో పరిస్థితి ఏంటీ? సరిగ్గా ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ఈ ప్రశ్నకు వెస్టిండీస్‌తో మూడో టీ20లో అద్భుతమైన జవాబు లభించింది.
ఫియర్‌లెస్ క్రికెట్..
ఫస్ట్ బ్యాటింగ్‌లోనూ టీమ్ గెలవాలంటే ఫియర్‌లెస్ క్రికెట్ ఆడాలి. ఎలా అంటే వాంఖడేలో ముగ్గురు మొనగాళ్లు రాహుల్, రోహిత్, కోహ్లీలా చెలరేగాలి. పొట్టి ఫార్మాట్‌లో రెండుసార్లు చాంపియన్ అయిన విండీస్ బౌలర్లను ఉతికి ఆరేసిన తీరులోనే దీనికి సమాధానం ఉంది. మామూలుగా ఫస్ట్ బ్యాటింగ్ అనగానే వికెట్‌ను కాపాడుకోవడం, లాస్ట్‌లో కొట్టడం.. ఇన్నాళ్లు టీమిండియా చేసిన తప్పు ఇదేనేమో. కానీ ఇప్పుడు ఫస్ట్ బాల్ నుంచే ఎవరో ఒకరు బాదుడు మొదలుపెడితే తర్వాత వచ్చే వాళ్లకు స్వేచ్చగా ఆడే చాన్స్ ఉంటుంది. దీనివల్ల స్కోరు వస్తుంది. గెలిచే చాన్సెస్ మెరుగవుతాయి. ‘ఫస్ట్ బ్యాటింగ్‌లో భారీ స్కోర్లు చేయాలని మేం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఫీల్డ్‌లో ప్లాన్స్‌ను సరిగ్గా అమలు చేయలేకపోయాం. ఇప్పుడు ఆ కొరత తీరింది. రోహిత్ బాదేసిన తర్వాత నాకు కొత్తగా ఆడే అవకాశం వచ్చింది. అందుకే చివరిదాకా క్రీజులో ఉండి వీలైనన్నీ షాట్లు కొట్టడానికే ప్రయత్నిస్తా అని రాహుల్‌కు చెప్పా. అది సూపర్ సక్సెస్ అయ్యింది. గతంలో ఇలా ప్రయత్నించినా సరైన దారి దొరకలేదు’ అని కోహ్లీ చెప్పాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 126 టీ20లు ఆడిన ఇండియా 79 విజయాలు సాధించగా 44 మ్యాచ్‌ల్లో ఓడింది. మూడింటిలో నో రిజల్ట్. అంటే ఇక్కడా విజయాల శాతం 70కి పైగానే ఉంది. ఫియర్‌లెస్ క్రికెట్ ఆడితేనే ఈ విజయాలు దక్కుతాయనేది సత్యం. బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ కూడా ఇదే చెబుతున్నాడు. ‘ఇండియా సిరీస్ కోల్పోతుందని ఎవరూ అనుకోలేదు. గెలవడం కూడా పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదు. కానీ టీ20ల్లో ఫియర్‌లెస్ బ్యాటింగ్ అంటే ఏంటో ఇప్పుడు చూశాం. భయం లేకుండా బాదేశారు. ప్రతి ఒక్కరు ప్లేస్ కోసం కాకుండా గెలుపు కోసం ఆడారు. వెల్‌డన్ ఇండియా’ అంటూ దాదా ట్వీట్ చేశాడు.
ఒకరిద్దరు ఆడితే..
ఏ ఫార్మాట్ అయినా ఆరంభంలో ఒకరిద్దరు ఆడితేనే ప్రత్యర్థి పెట్టే ఒత్తిడిని జయించొచ్చు. వాంఖడేలో రోహిత్ ఇదే చేశాడు. పిచ్ ఎలాగూ తనకు కొట్టిన పిండి కాబట్టి… బంతి లెంగ్త్‌ను పక్కాగా లెక్కలేసి మరి సిక్సర్లు బాదాడు. బాల్ ఎక్కడేసినా.. లాంగాన్, లాంగాఫ్, మిడాఫ్‌లో కళ్లు చెదిరే షాట్స్ కొట్టడంతో విండీస్ బౌలర్లు దారిలోకి వచ్చారు. రాహుల్ కూడా టెక్నికల్ షాట్లతో మంచి సహకారం ఇచ్చాడు. రోహిత్ ఔటైన తర్వాత వచ్చిన కోహ్లీ.. మొమెంటమ్ తగ్గకుండా చూశాడు. మామూలుగా కొత్తగా క్రీజులోకి వచ్చే బ్యాట్స్‌మన్ కుదురుకోవడానికి టైమ్ తీసుకుంటారు. ఆ సమయంలోనే బౌలర్లు పట్టు బిగిస్తారు. కానీ మూడో టీ20లో విరాట్ ఆ చాన్స్ కూడా ఇవ్వలేదు. రాహుల్ జోరుమీదున్న తానే ఎక్కువగా స్ట్రయికింగ్ తీసుకున్నాడు. ఆఫ్‌సైడ్ బాల్స్‌ను ఆన్‌సైడ్‌లో సిక్సర్‌గా మలవడం కెప్టెన్ కాన్ఫిడెన్స్‌కు అద్దం పడుతోంది. ఇందుకు మైండ్‌సెట్ కూడా ముఖ్యమే. అందుకే తన పెళ్లి రోజున జీవితాంతం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.కెప్టెన్‌గా, ప్లేయర్‌గా టీమ్‌లో తన పాత్ర కీలకమని నిరూపించుకున్నాడు.
ప్లేస్పై దిగులు లేదు: రాహుల్
ముంబై: జట్టులో స్థానం గురించి టెన్షన్ పడకుండా… బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడం నేర్చుకున్నానని టీమిండియా ఓపెనర్ లోకేశ్ రాహుల్ అన్నాడు. జాతీయ జట్టులో ప్లేస్‌పై అనిశ్చితి నెలకొంటే ఏ ప్లేయర్ అయినా ప్రశాంతంగా ఉండలేడన్నాడు. ‘టీమ్‌లో చోటు గురించి టెన్షన్ లేదని చెప్పను. ఎందుకంటే జట్టులోకి వస్తూపోతూ ఉంటే ఏ ఆటగాడికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవల్‌లో ఒత్తిడిని ఎదుర్కొని పరుగులు చేయాలంటే ఎవరికైనా కాస్త సమయం కావాలి. తర్వాతి టోర్నమెంట్‌కు నువ్వు టీమ్‌లో ఉంటావా అని అడిగితే సమాధానం చెప్పే పరిస్థితిలో లేను. అందుకే పెర్ఫామ్‌న్స్‌పై దృష్టి పెట్టా. చాన్స్ దొరికినప్పుడు మ్యాచ్‌ను గెలిపించాలని కోరుకుంటా. అదే క్రమంలో బ్యాటింగ్‌ను ఆస్వాదించాలనుకుంటా. ప్రస్తుతం నేను ఆ పనిలోనే ఉన్నా. టీమ్‌లో లేనప్పుడు రిలాక్స్‌గా ఉండను. మ్యాచ్ ప్రాక్టీస్ కోసం వీలైనంత ఎక్కువగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడతా’ అని రాహుల్ వెల్లడించాడు.
రోహిత్-రాహుల్ సూపర్
ఏ టీమ్‌కైనా ఆరంభం అనేది చాలా కీలకం. ఇందులో ఓపెనర్ల పాత్ర చాలా పెద్దది. వీళ్లు సక్సెస్ అయితే టీమ్ విజయాల సంఖ్య పెరుగుతుంది. వీళ్లు ఫ్లాఫ్ అయితే మిడిలార్డర్‌పై భారం పడుతుంది. చాలా సందర్భాల్లో మిడిలార్డర్ చెలరేగినా.. మ్యాచ్ గెలవాలంటే బౌలర్లు ఎక్కువగా కష్టపడాలి. ఎందుకంటే తక్కువ స్కోరును కాపాడుకోవాలి. వాంఖడేలో రోహిత్- రాహుల్ ఆడిన తీరును చూస్తే ఎంతటి ప్రత్యర్థికైనా గుండె గుబేలు మనాల్సిందే. ‘రోహిత్, రాహుల్ బ్యాటింగ్ అన్‌బిలివబుల్. ఫస్ట్ వికెట్‌కు 135 రన్స్ జోడించారంటేనే అద్భుతం. రోహిత్ భారీ షాట్లు కొడతాడని తెలుసు. కానీ రాహుల్ చాలా క్లారిటీతో ఆడాడు. మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి సమన్వయమే అవసరం. ఎందుకంటే బౌలర్ బాల్ వేసినప్పుడు షాట్‌కు వెళ్లాలా, బాల్‌ను డిఫెన్స్ చేయాలా? వంటి సందేహాలు వెంటాడుతాయి. వీటిని దాటేసి పర్‌ఫెక్ట్ షాట్స్ కొట్టాలంటే క్లారిటీ చాలా అవసరం. అందుకే విండీస్ బౌలర్లు ఎలాంటి బంతి వేసినా ఈ ఇద్దరు ఫుల్ క్లారిటీతో సిక్సర్లు కొట్టారు’ అని విరాట్ ప్రశంసలు కురిపించాడు.