డబుల్​ బెడ్రూం ఇల్లు కోసం బస్సు కిందపడ్డడు

డబుల్​ బెడ్రూం ఇల్లు కోసం  బస్సు కిందపడ్డడు

పుల్కల్, వెలుగు :  సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో డబుల్‌ బెడ్రూం ఇల్లు రాలేదని మనస్తాపంతో శుక్రవారం  ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు కింద పడ్డాడు.  కాలు విరిగి తీవ్ర గాయాలు కావడంతో  సికింద్రాబాద్​ గాంధీ దవాఖానలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.  డబుల్ బెడ్రూం ఇల్లు కావాలని స్థానిక ఎమ్మెల్యే చంటి  క్రాంతికిరణ్​తో పాటు సంబంధిత ఆఫీసర్ల చుట్టూ తిరిగి విసిగిపోయిన బట్టు చిరంజీవి రాజు రోడ్డుపై  బైఠాయించి ఆందోళన చేస్తున్నాడు.  ఈ క్రమంలో పుల్కల్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్టీసీ బస్సును అడ్డగించి కొంతసేపు పెట్రోల్ బాటిల్​తో  ధర్నా చేశాడు. ఉన్నట్టుండి అక్కడి నుంచి లేచి చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడుతుండగా అప్పటికే ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ రాజు లేచింది చూసి బస్సును ముందుకు కదిలించాడు. 

ఇది గమనించిన రాజు డ్రైవర్​పై  అరుస్తూ బస్సుకు అడ్డంగా వెళ్లి  సూసైడ్ చేసుకోబోయాడు.  బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్న రాజు కాలి నుంచి బస్సు టైరు వెళ్లింది. ఈ ఘటనలో అతడి కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి.  స్థానికులు వెంటనే రాజును సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా కాలి గాయం ఎక్కువ కావడంతో మెరుగైన ట్రీట్​మెంట్​ కోసం హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం రాజు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.  కాగా బస్సు డ్రైవర్ జగదీశ్​   ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.