కన్నుల పండువగా బతుకమ్మ వేడుకలు

కన్నుల పండువగా బతుకమ్మ వేడుకలు

వెలుగు, నెట్​వర్క్: తీరొక్క పూలతో ముస్తాబైన ముచ్చటైన బతుకమ్మలతో వాకిళ్లన్నీ పూదోటలైనయ్.. మగువలంతా ఆటచిలుకలై, పాటచిలుకలై ఆడి పాడుతుంటే నేల మీద రంగుల సింగిడిలు కదిలినయ్​. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ తప్పట్ల దరువులో కైగట్టి పాడిన కమ్మని ‘బతుకు’పాటలతో వాడలన్నీ మారుమోగినయ్​.. రాష్ట్రమంతా సోమవారం సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. 

ఇసుకేస్తే రాలనంతగా.. 

బతుకమ్మ ఆటపాటలతో వరంగల్​లోని పద్మాక్షిగుట్ట మారుమోగింది. లక్ష మంది తరలివచ్చి బతుకమ్మలు ఆడి, నిమజ్జనం చేశారు. సిద్దిపేట కోమటి చెరువు వద్ద బతుకమ్మ సంబురాలు పెద్ద ఎత్తున జరిగాయి. 50 వేల పై చిలుకు జనం వేడుకల్లో పాల్గొనగా, మంత్రి హరీశ్​ రావు సతీసమేతంగా హాజరయ్యారు. కరీంనగర్ లోని సీతారాంపూర్ లోని సాయిబాబా  టెంపుల్​,  మంకమ్మ తోట సత్యనారాయణ స్వామి దేవాలయం, మార్క్​ఫెడ్​ గ్రౌండ్ , లేక్ పోలీస్ స్టేషన్ , గౌతమి నగర్ మానేరు లేక్  వద్ద బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఆయాచోట్ల మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. మహాశక్తి ఆలయంలో వేడుకలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  హాజరయ్యారు. సిరిసిల్ల మానేరు తీరం పూలసంద్రమైంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని పెద్ద చెరువు వద్ద వేడుకలు గ్రాండ్​గా జరిగాయి. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. సూర్యాపేటలోని సద్దాల చెరువు వద్ద నిర్వహించిన సంబురాల్లో వేలాది మహిళలు పాల్గొన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి ఆయన భార్య సునీత తో కలిసి హాజరయ్యారు.  సంగారెడ్డి లోని వినాయక సాగర్ వద్ద, సూర్యాపేటలోని సద్దాల చెరువు వద్ద, భువనగిరిలోని పెద్ద చెరువు వద్ద, నిజామాబాద్ లోని బొడ్డెమ్మ చెరువు వద్ద బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. యాదగిరి గుట్ట వద్ద జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఇల్లందులో ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొని బతుకమ్మలాడారు.