
తెలంగాణలో అతి పెద్ద పండుగ బతుకమ్మ ఉత్సవాలు ఘనంగాజరుగుతున్నాయి. ఆడపడుచులు ఈ పండుగను వివిధ రకాల పూలతో, ప్రత్యేక నైవేద్యాలతో తొమ్మిది రోజులపాటు ఒక్కో పేరుతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నాలుగో రోజు ( సెప్టెంబర్ 24) బతుకమ్మ అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఏంటి? వేటితో ఎలా చేస్తారు? పూర్తి వివరాలు ఈ స్టోరీ లో చూద్దాం. .
తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున ( సెప్టెంబర్ 24) నానబియ్యం బతుకమ్మ గా అమ్మవారికి పూజలు చేస్తారు. నైవేద్యం కోసం మొదట బియ్యాన్ని కడిగి, నానబెట్టి, ఆ తర్వాత ఆరబెట్టి.. మెత్తగా పిండి చేస్తారు. అందులో పాలు, చక్కెర, నెయ్యి వేసి పాలకాయల్లా చిన్న ఉండలు చేస్తారు. వీటిని పచ్చిపిండి ముద్దలని పి లుస్తారు.
శరదృతువులో వచ్చే అనేక పండుగల్లో -పచ్చిపిండి ముద్దలు ప్రత్యేక నివేదనగా సమర్పి స్తారు. కొత్తగా వడ్లు వచ్చే కాలం కాబట్టి, బియ్యానికి కొదువ ఉండదు. పైగా ఇవంటే అమ్మకు ఎంతో ప్రీతి. అందుకే, నానిన బియ్యంతో చేసిన పదార్థాలు నైవేద్యం పెడతారు.
ఈ రోజు ( సెప్టెంబర్ 24) బతుకమ్మ పండుగలో ప్రత్యేక స్థానం కలిగినది. ఎందుకంటే ఇది పండుగలోని మధ్య దశలోని ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ రోజున ఆడపడుచులు బతుకమ్మను ఘనంగా పూజిస్తారు. ఈ రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యం శుద్ధి, సమృద్ధి కుటుంబంలో ఐక్యతను సూచిస్తుంది.బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలాడుతూ తెలంగాణ ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో ఈ పండుగను నిర్వహించుకుంటారు.
ALSO READ : నవరాత్రుల్లో రోజూ తులసి పూజ చేయండి..
ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ పాట లిరిక్స్
ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ
దూరాన దోర పండే గౌరమ్మ
దూరాన దొరలైరి గౌరమ్మ
పట్నాన పంతులైరి గౌరమ్మ
అటు చూసి మాయన్నలు గౌరమ్మ
ఏడు మేడ లెక్కిరి గౌరమ్మ
ఏడు మేడ లెక్కి ఎత్తులు దాటంగా
దొంగలెవరు దోసిరి గౌరమ్మ
బంగారు గుండ్ల వనమే గౌరమ్మ
ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ
దూరాన దోర పండే గౌరమ్మ
శ్రీ లక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
చిత్రమై తోచునమ్మ గౌరమ్మ
భారతీ దేవి బ్రహ్మకిల్లాలి వై పార్వతీదేవిపై ..
పరమేశురాణిపై పరగ శ్రీలక్ష్మిపై గౌరమ్మ
భార్యవైతివి హరికిని గౌరమ్మ
ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ
దూరాన దోర పండే గౌరమ్మ
ఎన్నెన్నో రూపాలు ఏడేడు లోకాలు..
ఉన్న జనులకు కోరికలు సమకూర్చగ
కన్న తల్లివైతివి గౌరమ్మ
కామధేనువు అయితివి గౌరమ్మ
ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ
దూరాన దోర పండే గౌరమ్మ
ముక్కోటి దేవతలు సక్కని కాంతలు ...
ఎక్కువ పూలు గూర్చి
పెక్కు నోములు నోమి ఎక్కువ వారైరి గౌరమ్మ
ఈ లోకముల నుండియు గౌరమ్మ
మన సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబిస్తూ బతుకమ్మ పండుగ ప్రజల జీవితంలో భాగమైంది. తొమ్మిది రోజులు కొనసాగే ఈ సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి.