
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మెడికల్ ఎక్విప్‌మెంట్ ఉత్పత్తి యూనిట్‌ను ప్రారంభించడానికి జర్మనీకి చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ బీఈబీఐజీ మెడికల్ ముందుకొచ్చింది. ఈ మేరకు కంపెనీ చైర్మన్ అండ్ సీఈఓ జార్జ్ చాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో భేటీ అయింది. రాష్ట్రంలో మెడికల్ ఎక్విప్‌మెంట్ ఉత్పత్తి యూనిట్‌ను ప్రారంభించడానికి తమ కంపెనీ ఆసక్తిగా ఉందని ఈ సందర్భంగా ప్రతినిధులు సీఎంకు తెలిపారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం.. తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. అనువైన స్థలం ఇతర అవసరాలపై అధ్యయనం చేసి ఒక నివేదికను సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాలతో పాటు, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే రేడియేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులను ఆయన కోరారు.