రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
  • ప్రకటించిన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్
  • 1985లో సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ లో చేరిన స్వర్ణ 
  • తొలిసారి ఓరుగల్లు మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్ గా, పార్టీలో వివిధ హోదాల్లో సేవలు
  • వరంగల్ మేయర్ గా విధులు
  • భారత్ జోడో యాత్రలో రాహుల్, రేవంత్ రెడ్డి పాదయాత్రలో కలిసి నడిచిన నేత

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ( టీపీసీసీ) మహిళా అధ్యక్షురాలిగా పార్టీ సీనియర్ నాయకురాలు ఎర్రబెల్లి స్వర్ణను ఏఐసీసీ అధిష్టానం నియమించింది. దాదాపు నాలుగు దశాబ్ధాలకు పైగా పార్టీనే నమ్ముకొని పని చేస్తున్న ఆమెకు ఈ గురుతర బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ఏఐసీసీ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు ఈ నియమాకం చేపట్టినట్టు స్పష్టం చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని వెల్లడించారు. అలాగే త్వరలో ఎన్నికలు జరగనున్న వెస్ట్ బెంగాల్ లోని 33 జిల్లాలకు సంబంధించి జిల్లా పర్యవేక్ష్యకులను అధిష్టానం నియమించింది.

సామాన్య కార్యకర్త నుంచి..

వరంగల్ కు చెందిన ఎర్రబెల్లి స్వర్ణ 1985 లో కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1991–2‌‌‌‌000 వరకు ప్రైమరీ అగ్రికల్చర్ కో -ఆపరేటివ్​ సొసైటీ చైర్మన్ గా, ఓరుగల్లు మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్ గా సేవలందించారు. 2005లో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో 39వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా గెలుపొందారు. తొలిసారి కార్పొరేటర్ గా గెలిచినప్పటికీ.. పార్టీ ఆమెకు వరంగల్ కార్పొరేషన్ మేయర్ గా అవకాశం కల్పించింది. ఉమ్మడి ఏపీలో మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ ఈస్ట్, వర్ధన్నపేట పీసీసీ మెంబర్ గా సేవలందించారు.

2014 లో వరంగల్ వెస్ట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమేలక్ష్యంగా 2022 , 23లో ప్రతిపక్ష నేతలుగా భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో చురుకుగా పాల్గొన్నారు. అలాగే, రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా తెలంగాణలో జరిగిన యాత్రలో స్వర్ణ అగ్రనేతతో కలిసి ముందుకు సాగారు. అనంతరం తెలంగాణ పీసీసీ జనరల్ సెక్రటరీ, చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గ ఇన్​చార్జిగా ఆమె సేవలందించారు. అయితే, దాదాపు 40ఏండ్లకు పైగా పార్టీ కోసం ఆమె చేసిన సేవల్ని గుర్తించిన అధిష్టానం.. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అవకాశం కల్పించింది.