V6 News

బీసీల లక్ష సాయం లొల్లి.. తన్నుకున్న బీఆర్‍ఎస్‍ లీడర్లు

బీసీల లక్ష సాయం లొల్లి.. తన్నుకున్న బీఆర్‍ఎస్‍ లీడర్లు
  • వరంగల్‍ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఘటన
  •     ఎమ్మెల్యే పెద్ది ముందే ఎంపీపీ, వైస్‍ ఎంపీపీ వాగ్వాదం
  •     మున్సిపల్‍ కాన్ఫరెన్స్​ హాల్‍లో కొట్టుకున్న నేతలు

వరంగల్‍/ నర్సంపేట, వెలుగు:  బీసీ కుల వృత్తులవారికి ప్రభుత్వం అందిస్తున్న రూ.లక్ష ఆర్థిక సాయం లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఇద్దరు బీఆర్‍ఎస్‍ ప్రజాప్రతినిధులు తన్నుకున్నారు. ఈ ఘటన శనివారం వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటుచేసుకుంది. చెన్నారావుపేట మండల ఎంపీపీగా బాదావత్‍ విజేందర్‍, వైస్‍ ఎంపీపీ, బీఆర్‍ఎస్‍ మండల కన్వీనర్‍గా కంది కృష్టారెడ్డి వ్యవహరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి గ్రామాల వారీగా బీసీ లబ్ధిదారుల జాబితా సేకరిస్తున్న క్రమంలో ఇరువురు లీడర్ల మధ్య తేడా వచ్చింది. కాంగ్రెస్‍ పార్టీ నుంచి కొన్ని నెలల క్రితం బీఆర్‍ఎస్‍ పార్టీలోకి వచ్చిన మాజీ ఎంపీపీ జక్క అశోక్‍ తనకు సంబంధించిన జల్లి గ్రామం నుంచి లబ్ధిదారుల పేర్లు ఇవ్వడం.. దానికి వైస్‍ ఎంపీపీ సపోర్ట్​ చేయడంపై విజేందర్‍ గొడవకు దిగినట్లు చెబుతున్నారు. ఉదయం ఇద్దరు నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంప్‍ ఆఫీసులో సుదర్శన్‍రెడ్డిని కలిశారు. ఎమ్మెల్యే ముందే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే ఇద్దరికి నచ్చజెప్పి పంపించారు. తర్వాత ఇరువురు తమ కేడర్‍తో కలిసి క్యాంప్‍ ఆఫీస్‍ను ఆనుకుని ఉండే ఎమ్మెల్యే మున్సిపల్‍ కాన్ఫరెన్స్​ హాల్‍లోకి వెళ్లి, అక్కడ కూడా తన్నుకున్నారు.

ఎంపీపీపై సస్పెన్షన్‍.. ఎంపీటీసీల అవిశ్వాసం 

ఎంపీపీ, వైస్‍ ఎంపీపీ మధ్య శనివారం గొడవ జరగగా.. మధ్యాహ్నం ఎమ్మెల్యే సుదర్శన్‍రెడ్డి ఆదేశాలతో ఎంపీపీ విజేందర్‍, జల్లి గ్రామానికి చెందిన బీఆర్‍ఎస్‍ నేత తొగరు చెన్నారెడ్డిలను మండల పార్టీ బాధ్యులు సస్పెండ్‍ చేశారు. విజేందర్‍ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో చర్యలు తీసుకున్నట్లు పార్టీ మండల కన్వీనర్‍ కృష్టారెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్‍ బుర్రి తిరుపతి తెలిపారు. ఎంపీటీసీలు విజేందర్‍పై అవిశ్వాస తీర్మానం పెడుతూ జిల్లా అధికారులకు నోటీసులు అందించారు.