- ఈ ప్రకటన చేశాకే ప్రధాని తెలంగాణకు రావాలి
- బీసీ సంఘాలు, అఖిలపక్ష పార్టీల నేతలు డిమాండ్
- 10న ప్రధాని రాక సందర్భంగా నిరసనలకు పిలుపు
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా జరిగే జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కలు కూడా చేపడతామని బిహార్ ఎన్నికల ముందు ఢిల్లీలో ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ ఎన్నికలు ముగియగానే మొండిచేయి చూపారని అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాల నేతలు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగణనలో బీసీ కులగణన కూడా చేస్తామని ప్రకటించిన తర్వాతే ప్రధాని తెలంగాణలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల10న ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసనలు చేపడతామని హెచ్చరించారు
. బీసీలను మోసం చేస్తే బీజేపీని బీసీల ద్రోహుల పార్టీగా ప్రకటిస్తామన్నారు. ‘బీజేపీ సభను జనాగ్రహ సభ అని కాకుండా.. బీసీల దగా ఆగ్రహ సభ’ అని మార్చుకోవాలన్నారు. శనివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ సంఘాలు, అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో కాంగ్రెస్ నుంచి వీహెచ్, బీఆర్ఎస్ నుంచి మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీజేఎస్ నుంచి ప్రొఫెసర్ కోదండరాం, సీపీఎం నుండి జాన్ వెస్లీ హాజరయ్యారు.
కేంద్రంపై బీసీలు తిరగబడాలి: కోదండరాం
సకల జనుల పోరాట స్ఫూర్తితోనే బీసీ రిజర్వేషన్లు సాధించుకోవాలని ఎమ్మెల్సీ కోదండరాం పిలపునిచ్చారు. అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్టాన్ని కేంద్రం ఆమోదించకుండా బీసీలను అవమానించిందని అన్నారు. ఇప్పుడు బీసీ కులగణన చేస్తామని మాట మార్చి మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై బీసీ సమాజమంతా తిరగబడాలని పిలుపునిచ్చారు ఈ నెల10న రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు తలపెట్టిన నిరసన ర్యాలీలకు టీజేఎస్ నుంచి పూర్తి మద్దతును ప్రకటించారు.
జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలోని 70 కోట్ల మంది బీసీల ఆకాంక్షలను బీజేపీ గుర్తించడం లేదన్నారు. గత 11 సంవత్సరాల బీజేపీ పాలనలో కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ గాని, బీసీ రిజర్వేషన్ల పెంపు, బీసీ కులగణన, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా, పార్లమెంటులో బీసీ బిల్లు తదితర డిమాండ్లు నెరవేర్చకుండా తీవ్ర అన్యాయం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
బీజేపీ బలహీన వర్గాల వ్యతిరేకి: జాన్ వెస్లీ
దేశవ్యాప్తంగా ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని గతంలో మండల ఉద్యమం వస్తే, బీసీ రిజర్వేషన్ డిమాండ్లు నీరుగార్చడానికి బీజేపీ కమాండల్ పేరుతో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించిందని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా 10వ తేదీన ఢిల్లీకి సెగ పుట్టించేలా బీసీలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
జనగణనలో కులగణన చేపట్టకుండా బీసీలను ప్రధాని మోదీ మోసం చేశారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించకుండా కేంద్రం అన్యాయం చేసిందని ఎమ్మెల్సీ మధుసూదనచారి అన్నారు. కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి, నాయకురాలు ఇందిరా శోభన్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, విక్రమ్ గౌడ్, బీసీ కుల సంఘాల నేతలు, మేధావులు పాల్గొన్నారు.
