8, 9న చలో ఢిల్లీ..బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్‌‌ను ముట్టడిస్తం: జాజుల శ్రీనివాస్ గౌడ్

8, 9న చలో ఢిల్లీ..బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్‌‌ను ముట్టడిస్తం: జాజుల శ్రీనివాస్ గౌడ్

ముషీరాబాద్, వెలుగు: 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల 8, 9 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి, పార్లమెంట్‌‌ను ముట్టడిస్తామని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు చేసిన మోసానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌‌లో బీసీల రాజకీయ యుద్ధభేరి మహాసభ నిర్వహించారు. 

జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌‌చారి అధ్యక్షతన జరిగిన ఈ సభకు జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. జాజుల మాట్లాడుతూ.. పిడికెడు శాతం లేని కులాలు 60 శాతం జనాభా ఉన్న బీసీల నోటి కాడ ముద్దను లాగేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

దొరలకు, పటేళ్లకు వ్యతిరేకంగా బీసీ ఉద్యమం ప్రారంభమైందని, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే 2028లో బీసీ సీఎం కావడం ఖాయమన్నారు. రిజర్వేషన్ల అంశంపై బీసీలకు న్యాయం జరగాలని తమకు ఎస్సీ, ఎస్టీలు అండగా నిలుస్తున్నారని తెలిపారు.