
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో, ర్యాలీలు
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శనివారం చేపట్టిన బీసీ బంద్ ప్రశాంతంగా ముగిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, మాస్ లైన్ పార్టీలు, బీసీ సంఘాలతో పాటు ఎస్సీ, ఎస్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
అంబేద్కర్ విగ్రహాల వద్ద వినతిపత్రాలు ఇచ్చారు. జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలంలోని ఆర్టీసీ బస్సులు డిపోలు, బస్టాండ్లకే పరిమితమయ్యాయి. దీపావళి పండుగ నేపథ్యంలో దూర ప్రాతాల నుంచి రైలు ద్వారా వచ్చిన ప్రయాణికులు తమ గ్రామలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. బంద్‌తో పలువురు ఉద్యోగులు ఆఫీసులకు ఆలస్యంగా వెళ్లారు. సత్తుపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, తెల్లం వెంక్రటావ్, రాందాస్ నాయక్, జారే ఆదినారాయణ, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, బీసీ సంఘాల నేతలు ఆర్జేసీ కృష్ణ, కూరాకుల నాగభూషయ్య, బొమ్మా రాజేశ్వరరావుతోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా కులగణన చేసి అన్ని పార్టీల ఆమోదం తీసుకుని బీసీ రిజర్వేషన్ కోసం ప్రయత్నిస్తే భారత రాష్ట్రపతి, గవర్నర్ ఏ మాత్రం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. చట్ట సభల్లో రిజరేష్వన్ కు ఆమోదం తెలిపినా, సాంకేతిక కారణాలతో అడ్డం తిరుగుతున్నారని విమర్శించారు.
ఇప్పటికైనా ప్రధాని మోదీ చట్టబద్ధంగా చేసిన చట్టాన్ని, సవరణలు చేసి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కొన్నిచోట్ల బంద్ లో బీజేపీ వర్సెస్ సీపీఎం నాయకుల హోరాహోరీ నినాదాలు చేసుకున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లో ముస్లింలకు స్థానం కల్పించడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖమ్మం సీపీ సునీల్ దత్ బంద్‌ను పర్యవేక్షించారు. - నెట్వర్క్, వెలుగు