
- మెట్రో, ఎంఎంటీఎస్‌లో పెరిగిన రద్దీ
హైదరాబాద్‌సిటీ, వెలుగు: బీసీ బంద్ ఆర్టీసీ పై తీవ్ర ప్రభావం చూపింది. శనివారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్‌తో పాటు గ్రేటర్ పరిధిలోని అన్ని డిపోల నుంచి బస్సులను బయటకు రానివ్వలేదు. బీసీ జేఏసీ నాయకులు ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకున్నారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నగరంలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు వెళ్లే బస్సులు కూడా డిపోల నుంచి బయకు రాకపోవడంతో ఆర్టీసీ పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
బస్సుల్లేక జిల్లాలకు వెళ్లేవారు, నగరంలోని ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే అదనుగా ప్రైవేట్వాహనదారులు అధిక చార్జీలతో దోపిడీ చేశారు. ముఖ్యంగా ఆటోలు, క్యాబ్‌లు, ర్యాపిడో సర్వీసుల వారు సాధారణ రోజుల్లో తీసుకునే చార్జీల కంటే రెండు మూడు రెట్లు అధికంగా వసూలు చేశారు. ఉదాహరణకు సూర్యాపేటకు రెగ్యులర్‌గా బస్‌చార్జీ రూ.200 ఉంటే, రూ.700 తీసుకున్నారు. ఉప్పల్ నుంచి జనగామకు రూ.200 అయితే రూ. 800 దాకా తీసుకున్నారని ప్యాసింజర్లు వాపోయారు.
ఇక సికింద్రాబాద్ నుంచి కోఠికి ఆటోలో వెళ్తే సాధారణంగా రూ.75 నుంచి రూ.100 తీసుకుంటారు. కానీ శనివారం రూ.200 నుంచి రూ.250 రూపాయలు వసూలు చేశారు. ఇక ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లే స్థోమత లేనోళ్లు మెట్రో, ఎంఎంటీఎస్ వైపు మళ్లారు. దీంతో ఎన్నడూ లేని విధంగా రద్దీ ఏర్పడింది. బస్సుల్లేక కొందరు ఆటో ట్రాలీలలో కూడా ప్రయాణించడం కనిపించింది.
కాగా, బస్సులు నడవకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లేవారంతా ఎంజీబీఎస్, జేబీఎస్‌లో గంటల తరబడి పడిగాపులు కాశారు. దీపావళి నేపథ్యంలో వరుస సెలవులతో సొంతూళ్లకు వెళ్లాలనుకున్న చాలామంది బస్సుల్లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. బంద్కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.13 కోట్ల ఆదాయం కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రూ.4.5 కోట్ల ఆదాయం కోల్పోయినట్టు చెప్పారు.