సర్టిఫికెట్ల కోసం అవే తంటాలు..ఆఫీసుల దగ్గర పడిగాపులు

సర్టిఫికెట్ల కోసం అవే తంటాలు..ఆఫీసుల దగ్గర పడిగాపులు
  •     తహసీల్దార్ ఆఫీసుల దగ్గర పడిగాపులు
  •     చాలాచోట్ల ఆందోళనలతో ఉద్రిక్తత
  •     గద్వాల జిల్లా ఐజలో తహసీల్దార్ కారు అడ్డగింత
  •     వనపర్తి జిల్లా పెబ్బేరులో ఆఫీసుకు తాళమేసిన సిబ్బంది

నెట్‌‌వర్క్, వెలుగు:  సర్కారు ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సాయం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు సమయానికి సర్టిఫికెట్లు అందక బీసీలు నానా అవస్థలు పడ్డారు. తహసీల్దార్ ఆఫీసుల దగ్గర పడిగాపులు పడ్డారు. మంగళవారం చివరి రోజు కావడంతో క్యాస్ట్, ఇన్​కమ్​సర్టిఫికెట్ల కోసం ఉదయం నుంచే వందలాది మంది ఆఫీసు దగ్గరకు చేరుకున్నారు. భారీగా జనం రావడం, సర్వర్ ప్రాబ్లమ్​తోడు కావడంతో సర్టిఫికెట్లు జారీ కాలేదు. దాంతో చాలాచోట్ల ఆందోళనలతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
 

సర్టిఫికెట్లు ఇచ్చే దాకా వెళ్లనివ్వబోమంటూ..

తమకు సర్టిఫికెట్లు ఇచ్చేదాకా బయటికి వెళ్లనిచ్చేది లేదంటూ జోగులాంబ గద్వాల జిల్లా ఐజ తహసీల్దార్ లక్ష్మి కారును జనం అడ్డుకున్నారు. వారం రోజుల నుంచి తిరుగుతున్నా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ బ యటకు వెళ్తుండడాన్ని గమనించి ఆమె కారుకు అడ్డంగా కూర్చున్నారు. సర్వర్ ప్రాబ్లం వల్ల ఆలస్యమైందని, తానేమీ చేయలేనని చెప్పినా జనం వినలేదు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ నరేశ్ అక్కడికి చేరుకుని జనాన్ని శాంతింపచేసే ప్రయత్నం చేశారు. పోలీసుల భద్రత నడుమ తహసీల్దార్ లక్ష్మి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

జనం తాకిడిని తట్టుకోలేక..

సర్టిఫికెట్ల కోసం జనం ఒక్కసారిగా పోటెత్తడంతో వనపర్తి జిల్లా పెబ్బేరు తహసీల్దార్ ఆఫీసుకు సిబ్బంది తాళం వేశారు. అధికారులు ఎవరూ లేకపోవడం, కొద్దిమంది సిబ్బంది ఉండడంతో వచ్చిన జనానికి సమాధానం ఇవ్వలేక తంటాలు పడ్డారు. సర్టిఫికెట్ల కోసం వచ్చిన వారు ఆఫీసు ఆవరణలో చెట్ల కిందే పడిగాపులు పడ్డారు. మరోవైపు జనాల అవసరాన్ని కంప్యూటర్ ఆపరేటర్లు క్యాష్ చేసుకున్నారు. ఒక్కో సర్టిఫికెట్‌‌కు రూ.500 నుంచి  రూ.2000 వరకు వసూలు చేశారు. వనపర్తి తహసీల్దార్ ఆఫీసులోనూ పలువురు తహసీల్దార్ రాజేందర్ గౌడ్‌‌తో వాగ్వాదానికి దిగారు. ఇప్పటికే 15 వేల సర్టిఫికెట్లు ఇచ్చామని, ఇంకా 5 వేలు పెండింగ్​లో ఉన్నాయని ఆయన చెప్పారు. సర్వర్ ప్రాబ్లమ్ వల్ల లేటు అవుతోందని, ఇలాగే ఒత్తిడి తెస్తే ఆఫీస్ మూసుకుని వెళ్తామని ఆయన హెచ్చరించారు.