సర్టిఫికెట్ల కోసం బీసీల తిప్పలు.. తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా

సర్టిఫికెట్ల కోసం బీసీల తిప్పలు.. తహసీల్దార్  కార్యాలయం ముందు ధర్నా

బీసీ రుణాల కోసం అవసరమైన కులం, ఆదాయ సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయాలకు జనం పోటెత్తారు. తాజాగా మహబూబాబాద్ పట్టణంలో ఎమ్మార్వో కార్యాలయంలో ఆదాయం, కులం సర్టిఫికెట్ల కోసం లబ్దిదారులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అప్లై చేసుకుని వారం గడిచినా..పత్రాలు  ఇవ్వడం లేదని దరఖాస్తు దారులు ఆందోళన నిర్వహించారు. 

మహబూబాబాద్ తహసిల్దార్ అధికారులు క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ధర్నా చేపట్టారు. బీసీ రుణాల గడువు దగ్గర పడటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పనులు వదులుకొని తహసీల్దార్ కార్యాలయం చుట్టే తిరుగుతున్నామన్నారు. అప్లై చేసుకున్న సర్టిఫికెట్లు వెంటనే మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 

ఈనెల(జూన్ 20) వరకే బీసీలకు లక్ష ఆర్థిక సాయం స్కీమ్ గడువు ఉండటంతో ఇంకా కులం, ఆదాయం సర్టిఫికెట్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఆలోపు సర్టిఫికెట్లు రాకపోతే అప్లై చేసుకోవడం కష్టంగా మారుతుందన్నారు. దరఖాస్తుదారులకు అవసరమైన సర్టిఫికెట్ల అందజేతలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అప్లికేషన్లు వేల సంఖ్యలో పెండింగ్ లో ఉంటున్నాయని మండిపడ్డారు. వాటన్నింటిని వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.