అక్టోబర్ 18న బీసీ బంద్.. సబ్బండ వర్గాల మద్దతు..పలు ప్రాంతాల్లో సంఘీభావ ర్యాలీలు

అక్టోబర్ 18న బీసీ బంద్..  సబ్బండ వర్గాల మద్దతు..పలు ప్రాంతాల్లో సంఘీభావ ర్యాలీలు

బషీర్​బాగ్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్​కు అన్ని కుల సంఘాలు మద్దతు తెలిపాయి. బంద్​కు మద్దతుగా శుక్రవారం వివిధ సంఘాలు సమావేశమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి. సంఘీభావంగా పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బషీర్‌‌బాగ్‌‌లోని బాబు జగ్జీవన్ రావు విగ్రహం నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్​ వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. 

బీసీ జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని, కో -చైర్మన్ దాసు సురేశ్, రాజారాం యాదవ్ నేతృత్వం వహించగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మార్పీఎస్ చీఫ్​మంద కృష్ణమాదిగ, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, గిరిజన జేఏసీ అధ్యక్షుడు సంజీవనాయక్, ఆమ్ ఆద్మీ నేత సుధాకర్ తదితరులు సంఘీభావం తెలిపారు. 

ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బంద్​కు వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు సహకరించాలని కోరారు. అనంతరం హిమాయత్​ నగర్​లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కృష్ణయ్య పాల్గొన్నారు.

చట్టం చేసే వరకు విశ్రమించం..

ముషీరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై పార్లమెంట్​లో చట్టం చేసే వరకు విశ్రమించబోమని, పోరాటంలో భాగంగా 18న ద్​ను సక్సెస్​ చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి పిలుపునిచ్చింది. శుక్రవారం చిక్కడపల్లిలోని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆఫీసులో బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్, బీసీ ఎస్సీ, ఎస్టీ జేఏసీ కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్, పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ తదితరులు హాజరై మాట్లాడారు. ఈ నెల 24న ఇందిరాపార్కు వద్ద బీసీల మహాధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. 

బంద్​కు మద్దతుగా ర్యాలీ..

ముషీరాబాద్: బంద్​కు మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం నేతృత్వంలో సుమారు వెయ్యి మంది స్టూడెంట్స్​ విద్యానగర్ నుంచి ఓయూ ఎన్​సీసీ గేటు వరకు ర్యాలీ నిర్వహించారు.

గౌడ్స్​ హాస్టల్​ మద్దతు..

హైదరాబాద్​ సిటీ: బీసీల బంద్​కు తాము మద్దతు ఇస్తున్నట్లు హైదరాబాద్ గౌడ్ హాస్టల్ అధ్యక్షుడు మోతె చక్రవర్తి గౌడ్ ప్రకటించారు. శుక్రవారం తన కార్యాలయంలో మేనేజింగ్ కమిటీ సభ్యులతో సమావేశమై మాట్లాడారు. బంద్ కు అన్ని కులాలు సహకరించాలని కోరారు.

అంబేద్కర్​ విగ్రహానికి వినతి..

చందానగర్: బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో భాగంగా శేరిలింగంపల్లి బీసీ జేఏసీ వినూత్న నిరసన తెలిపింది. శుక్రవారం చందానగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంఘాల నాయకులు ఆందోళన చేసి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

ప్రతి ఒక్కరూ సహకరించాలి..

గండిపేట: బంద్​కు ప్రతీఒక్కరు సహకరించాలని బీసీ విద్యార్థి జేఏసీ నేత వేముల రామకృష్ణ కోరారు. రాజేంద్రనగర్‌‌లో రౌండ్‌‌ టేబుల్‌‌ సమావేశం నిర్వహించగా బీజేపీ, బీఆర్‌‌ఎస్, కాంగ్రెస్‌‌, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. బంద్​కు వ్యాపారులు సహకరించకుంటే బలవంతంగా షాపులు మూసివేస్తామని హెచ్చరించారు.

బీసీ ఉద్యోగుల సంఘం మద్దతు..

బషీర్​బాగ్: బంద్ కు తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం సమావేశమయ్యారు. బంద్​కు మద్దతుగా మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపడుతామని చెప్పారు. 

జేబీఎస్ జనసంద్రం

ఇయ్యాల బీసీ బంద్, ఆ తర్వాత సండే, దీపావళి సెలవులు కావడంతో జనం సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి జేబీఎస్ బస్టాండ్​ రద్దీగా మారింది. అదనపు బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ బస్టాండ్ మొత్తం జన సంద్రమైంది.