బీసీ కులాల డేటా తీస్తేనే రాజకీయ వాటా దక్కుతుంది : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీ కులాల డేటా తీస్తేనే రాజకీయ వాటా దక్కుతుంది :  జాజుల శ్రీనివాస్ గౌడ్

బషీర్ బాగ్, వెలుగు: బీసీ కులాల డేటా తీస్తేనే, రాజకీయ వాటా దక్కుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీసీల కుల గణనను వెంటనే చేపట్టాలని ఆయన కోరారు. శనివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో జాజుల మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ కుల గణనను నిర్వహించి, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హామీని ఇచ్చారని జాజుల గుర్తు చేశారు. 

అయితే, జనవరి 31న సర్పంచుల పదవీ కాలం ముగియనుండటంతో ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు. రిజర్వేషన్లను పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు అన్యాయానికి గురవుతారని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లను తగ్గించి, బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీసీలు గద్దె దింపారని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కుల గణన చేపట్టి, రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని కోరారు. రిజర్వేషన్లు పెంచే వరకు గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాజుల విజ్ఞప్తి చేశారు.