బలహీన వర్గాలపై దాడులను తీవ్రంగా పరిగణిస్తం : తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

బలహీన వర్గాలపై దాడులను తీవ్రంగా పరిగణిస్తం : తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
  •     తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
  •     కుమ్మెరలో బాధిత కుటుంబానికి పరామర్శ

నాగర్ కర్నూల్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామం దేవాలయంలో ఈ నెల 18న జరిగిన ఘటనలో రెండు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. బడుగు బలహీనవర్గాలపై దాడులను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. మంగళవారం కుమ్మెర గ్రామాన్ని ఆయన బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, టి.సురేందర్, బాలలక్ష్మిలతో కలిసి సందర్శించారు. 

ఘటన జరిగిన దేవాలయ పరిసరాలను పరిశీలించి కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హోంగార్డు రికార్డ్​ చేసిన కొబ్బరికాయల గదిలో దాడి ఘటన వీడియోను డీఎస్పీ శ్రీనివాసులు చైర్మన్ కు చూపించారు. మృతిచెందిన చిన్నారి సమాధి వద్ద నివాళి అర్పించి బాధితుడు గణేశ్ ఇంటిని నిరంజన్​పరిశీలించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కుమ్మెర మల్లన్న జాతరకు భారీగా భక్తులు వస్తారని తెలిసినా దేవాదాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులు సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆధిపత్య వర్గాలవారు టికెట్లు ముద్రించి అమ్ముకున్నట్లు గుర్తించామన్నారు. కలెక్టర్, ఎస్పీ, దేవాదాయ శాఖల నుంచి కమిషన్ చైర్మన్ పూర్తి స్థాయి నివేదిక కోరారు. వాటిని పరిశీలించి ప్రభుత్వానికి సమగ్ర రిపోర్టు అందిస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి బీసీ కమిషన్ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం బాధితులు గణేశ్, మౌనికలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనే

రెండు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన నిందితులను ఈ ప్రభుత్వం ఎన్నాళ్లు కాపాడుతుందని పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. కమ్మెర గ్రామంలో గణేశ్, మౌనిక దంపతులపై దాడికి పాల్పడి.. పసిపాప మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్​తో నాగర్​కర్నూల్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

మంగళవారం బీజేబీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్, డీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, పలు ప్రజాసంఘాలు, కుల సంఘాల నాయకులు ధర్నా శిబిరంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేవాలయం దగ్గర పర్యవేక్షణ లోపించడం, గ్రామ పెత్తందార్ల ఆధిపత్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. ఘటనపై హత్యకేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.