
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం జీఓ జారీ చేయడం చరిత్రాత్మక నిర్ణయమని బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ ఒక ప్రటకనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ జీఓ వల్ల వెనుకబడిన తరగతుల ప్రజల కల నెరవేరిందన్నారు. ఈ జీఓ అమలు చేస్తే వెనుకబడిన వర్గాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించి సమాజంలో సౌభ్రాతృత్వం పెంచటానికి అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు.
ఇది బీసీల విజయం: జాజుల
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం జీఓ విడుదల చేయడం అభినందనీయమని, ఇది బీసీల విజయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ రిజర్వేషన్లను కోర్టుల ద్వారా అడ్డుకోవాలని ఎవరూ ప్రయత్నించవద్దని ఆయన కోరారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అసెంబ్లీలో అన్ని పార్టీలు సహకరించిన విధంగానే ఇప్పుడు కూడా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.