ఎస్పీ డీసీ ఎల్ లో నియామకాల వివరాలు ఇవ్వండి : బీసీ కమిషన్

ఎస్పీ డీసీ ఎల్ లో నియామకాల వివరాలు ఇవ్వండి : బీసీ కమిషన్

హైదరాబాద్, వెలుగు:  ఎస్పీడీసీఎల్ లో గత 12 ఏండ్లలో జరిగిన నియామకాలు, ప్రమోషన్ల వివరాలు ఇవ్వాలని సీఎండీ జితేశ్ వి.పాటిల్ ను బీసీ కమిషన్ ఆదేశించింది. సోమవారం హైదరాబాద్ మింట్  కాంపౌండ్ లోని ఎస్పీడీసీఎల్ ఆఫీస్​లో సీఎండీ, డైరెక్టర్లతో కమిషన్  చైర్మన్ నిరంజన్, మెంబర్లు సురేందర్, బాలలక్ష్మి, జయప్రకాష్  రివ్యూ నిర్వహించారు.

ఎస్పీడీసీఎల్​లో నియామకాలు, ప్రమోషన్లలో  బీసీలకు అన్యాయం జరుగుతోందని పలువురు అధికారులు, ఉద్యోగులు బీసీ కమిషన్ కు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్​ ఉందని కమిషన్  దృష్టికి సీఎండీ తీసుకెళ్లారు. పెండింగ్  కేసులకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేయాలని సీఎండీని కమిషన్  చైర్మన్  ఆదేశించారు. బీసీ ఉద్యోగుల సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకెళ్లేందుకు స్పెషల్​ ఆఫీసర్ ను నియమించాలన్నారు. అలాగే డిస్కంలో బీసీ సెల్  ఏర్పాటుకు ఆఫీసు కేటాయించాలన్నారు.