హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆవిర్భావం (2014) నుంచి ఇప్పటివరకు జెన్‌కోలో జరిగిన నియామకాలపై నివేదిక ఇవ్వాలని ఆ సంస్థ సీఎండీ సాయి హరీశ్ ను బీసీ కమిషన్ ఆదేశించింది. రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో జరుగుతున్న నియామకాల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల అమలులో సరైన పద్ధతులు పాటించడం లేదని విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం నేతలు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కమిషన్ ఎన్ పీడీసీఎల్, ఎస్ పీడీసీఎల్ , ట్రాన్స్‌కో కార్యాలయాలకు వెళ్లి వివరాలు సేకరించింది.
సోమవారం ఖైరతాబాద్‌లోని విద్యుత్ సౌధలో ఉన్న జెన్‌కో కార్యాలయాన్ని బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్, సభ్యులు సురేందర్, జయప్రకాశ్, బాలలక్ష్మి సందర్శించారు. నియామక ప్రక్రియలు, రోస్టర్ పాయింట్ల అమలుపై అధికారులతో చర్చించారు. ఉద్యోగుల ప్రమోషన్లు, రిజర్వేషన్ల వారీగా కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ.. సంస్థ యాజమాన్యం, ఉద్యోగులు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
