హైదరాబాద్, వెలుగు: గత నాలుగేండ్లుగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్బకాయిలను తక్షణమే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు బీసీ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. పాత పద్ధతి ప్రకారమే ఫీజు రీయింబర్స్మెంట్అమలు చేయాలని, నాలుగేండ్ల బకాయిలు రూ. 7 వేల కోట్లు తక్షణమే చెల్లించాలని కోరారు. శనివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ ప్రతినిధులు లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి బాధాకరమన్నారు. ఒకవైపు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాక, ఇంకొక వైపు కళా శాల యజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వక, పరీక్షలు రాయనీయక, కోర్సు పూర్తి చేసినా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు.
