పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలి : బీసీ నేత జాజుల

పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల  బిల్లు ఆమోదించాలి : బీసీ నేత జాజుల
  • 50 శాతం లిమిట్​ను ఎత్తివేయాలి: బీసీ నేత జాజుల

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణం  ప్రభుత్వం పంపిన బీసీ బిల్లులను ఆమోదించాలని కేంద్రాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్  డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేయాలన్నారు. జనగణన, కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లను పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే కల్పించాలని కోరారు. సోమవారం ఏపీలోని తిరుపతిలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ కేసన శంకర్ రావుతో కలిసి జాజుల మీడియాతో మాట్లాడారు.

 మూడు దశాబ్దాలుగా  తాము చేస్తున్న  పోరాటం ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం జనగణన, కులగణన చేయడానికి సిద్ధమైందని తెలిపారు. 2026లోనే మహిళా బిల్లులను పూర్తి చేసి..అందులో  బీసీ మహిళలకు సబ్ కోటా రిజర్వేషన్లను పెంచాలన్నారు. వచ్చేనెల 7న గోవాలోని శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించే జాతీయ ఓబీసీ మహాసభకు రావాలని  ప్రధాని మోదీ,  కేంద్ర మంత్రులను, వివిధ రాష్ట్రాల సీఎం, అఖిలపక్ష పార్టీల అధ్యక్షులను ఆహ్వానించునున్నట్లు జాజుల  తెలిపారు. అగ్రవర్ణాల రిజర్వేషన్లపై పున‌‌‌‌ఃసమీక్షించి జనాభా, సామాజిక వెనుకబాటుతనం, పేదరికం ఆధారంగా రిజర్వేషన్​ను నిర్ధారించాలని జాజుల కోరారు.