- నేడు, రేపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీల మహాధర్నా
- అన్ని పార్టీలకు, ఎంపీలకు ఇన్విటేషన్
- 29 రాష్ట్రాల నుంచి అటెండ్ కానున్న బీసీలు
హైదరాబాద్, వెలుగు: దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో బీసీ కులగణన చేపట్టాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్నది. ఈ అంశంపై దేశంలోని అన్ని పార్టీలను, ఎంపీల మద్దతును తెలంగాణ బీసీ సంఘాల నేతలు కూడగడుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సోమ, మంగళవారాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా చేపడుతున్నాయి. పాల్గొనేందుకు తెలంగాణ, ఏపీ నుంచి బీసీ సంఘాల నేతలు ఇప్పటికే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. దేశంలోని 29 రాష్ట్రాల నుంచి బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున అటెండ్ కానున్నారు.
బీసీల దశాబ్దాల డిమాండ్
సమగ్ర కులగణన చేపట్టాలని కొన్ని దశాబ్దాలుగా దేశ వ్యాప్తంగా బీసీలు ఉద్యమాలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టాయి. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 2024 ఎంపీ ఎన్నికలకు ముందు దేశ వ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనను దేశ వ్యాప్తంగా బీసీలు అభినందించాయి. దేశ వ్యాప్తంగా కులగణన డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి జాతీయ జనగణనలో సమగ్ర కులగన చేపడతామని గతేడాది ఏప్రిల్ 30 జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ప్రకటించింది.
గెజిట్ లో లేని బీసీ కుటుంబాల సంఖ్య అంశం
కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగానే వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన చేపడుతోంది. అందులో భాగంగానే మొదటి దఫాలో కుటుంబాల సంఖ్యను లెక్కపెట్టనున్నది. అందుకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. గెజిట్ ద్వారా 33 ప్రశ్నలను రూపొందించారు. అయితే ఇందులో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఎన్ని ఉన్నాయని అడిగిన కేంద్ర ప్రభుత్వం బీసీ కుటుంబాల సంఖ్యను విస్మరించింది. దీంతో బీసీల ఇండ్లను లెక్కించాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశాన్ని బీజేపీ నేతల దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం ఇళ్ల గణన జరుగుతోందని, జనగణన స్టార్ట్ చేసేముందు వచ్చే ఏడాది బీసీ కుటుంబాల సంఖ్య అంశం క్వశనీర్ లో ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ మాటలు నమ్మశక్యంగా లేవని, ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని బీసీ సంఘాల నేతలు పట్టుబడుతున్నారు.
