బీసీలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ కుట్ర.. బీసీ సంఘం నేతల ఆగ్రహం

బీసీలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ కుట్ర.. బీసీ సంఘం నేతల ఆగ్రహం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర పన్నాడని...బీసీ బంధు పేరుతో బీసీల మధ్య చిచ్చుపెడుతున్నాడని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 28వ తేదీ బుధవారం వికారాబాద్ జిల్లా పరిగిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చి పోయారు కానీ బీసీలను కేసీఆర్ మోసం చేసినట్లు ఎవరు చేయలేదని.. తెలంగాణ ఉద్యమంలో బీసీలే ఎక్కువ పాల్గొన్నారని గుర్తు చేశారు. బీసీలు రాష్ట్ర సాధనకు ప్రాణ త్యాగాలు చేశారని.. ఏ ఒక్క అమర వీరుడి కుటుంబానికి న్యాయం చేయలేదని మండిపడ్డారు.

తెలంగాణలో 60% మంది బీసీలు ఉన్నారని.. కేసీఆర్ చేసిన అప్పుల్లో అధిక భారం మోసేది బీసీలేనని అన్నారు. బీసీలకు ఆర్థిక సాయం అనే పేరుతో ఒక్కో వ్యక్తి నుండి అప్లికేషన్ కోసం 350 రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. రాష్ట్రం మొత్తం 5 లక్షల 13 వేల మంది బీసీ బంధుకు అప్లయ్ చేశారని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లాలో 13 వేల పై చిలుకు మంది ఆప్లై చేశారాన్నారు. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి వికారాబాద్ జిల్లాను చిన్న చూపు చూస్తున్నారని విమర్శించారు. బీసీలందరికీ(ఉపకులాకు)ఒకే సారి రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని కోరారు. లేని పక్షంలో పార్టీలకు అతీతంగా బీసీలందరిని ఏకం చేసి గ్రామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లను, నాయకులను తిరుగనియ్యమని.. చిత్తు చిత్తుగా కేసీఆర్ ను ఓడిస్తామని బీసీ సంక్షేమ సంఘం నేతలు హెచ్చరించారు.