- పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కు బీసీ సంఘాల నేతల విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం 56 శాతం టికెట్లు కేటాయించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను బీసీ జేఏసీ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. చట్టపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వీలు కాకపోతే పార్టీ పరంగా టికెట్లు ఇవ్వాలని కోరారు. మున్సిపల్ చైర్మన్లలో కూడా 68 మున్సిపల్ చైర్మన్లుగా బీసీలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎవరి జనాభా ఎంత ఉందో వారికి అంతే వాటా దక్కాలన్న సూత్రాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలన్నారు.
మహేశ్ గౌడ్, మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని వెల్లడించారు. అయినా బీసీలకు రాజకీయ అవకాశాలు పెంచడానికి పార్టీపరంగా అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పార్టీలో అందరితో చర్చించి బీసీలకు రాజకీయంగా న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.
